సొంత కూతురిపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తిని కేరళలోని మంజేరీ 'పోక్సో' ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చి.. నాలుగు జీవిత ఖైదుల శిక్ష విధించింది. రూ.3 లక్షల జరిమానా చెల్లించాలని కూడా ఆదేశించింది. మరో కేసులో 17 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. జరిమానా కట్టడంలో విఫలమైతే.. మరో రెండేళ్ల శిక్ష అమలు చేయాలని అధికారులను ఆదేశించింది.
ప్రస్తుతం అదే వ్యక్తి మరో కూతురిని లైంగికంగా వేధించిన కేసులో జైలులో ఉన్నాడు. ఆ వ్యక్తికి.. ఇండియన్ పీనల్ కోడ్‌లోని వివిధ సెక్షన్ల కింద జైలు శిక్ష విధించింది కోర్టు. కూతుళ్లిద్దరూ మైనర్లు (ఒకరు 15, మరొకరు 17) కావడం గమనార్హం.
భార్యతో గొడవ.. కుతుళ్లకు వేధింపులు..
తన భార్యతో గొడవ పడి విడిపోయిన తర్వాత.. 2014-2016 మధ్యలో తన ఇద్దరు కూతుళ్లను లైంగికంగా వేధించసాగాడు అతడు. కూతుళ్లిద్దరూ తల్లికి చెప్పగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2016లో భర్త అఘాయిత్యాలపై పోలీసులకు ఫిర్యాదు చేసిందామె. లైంగిక వేధింపుల విషయాన్ని తల్లికి చెప్పారనే కారణంతో పలు మార్లు కూతుళ్లిద్దరినీ చంపుతానని బెదిరింపులకు కూడా పాల్పడ్డాడతడు.