కేరళలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం కొత్తగా 29,322 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మహమ్మారి ధాటికి మరో 131మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు ప్రస్తుతం 17.91గా ఉంది.
కేరళలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్.. కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో స్థానిక కమిటీలు ఏర్పాటు చేసి వైరస్ తీవ్రతను అంచనా వేయాలని సూచించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ సరైన పరిష్కారం కాదన్నారు. దానివల్ల రాష్ట్ర ఆర్థికవ్యవస్థ, ప్రజల జీవనవ్యవస్థ దెబ్బతింటుందని తెలిపారు. ఇప్పటివరకు వ్యాక్సిన్ మొదటి డోస్ 74శాతం మందికి, రెండోడోసు 27శాతం మందికి అందిచామన్నారు.
వ్యాక్సిన్ కొరత..
కేరళలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 41లక్షలు దాటింది. మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత ఆందోళన కలిగిస్తోందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. టీకా డోసులు అందించాలని కేంద్రానికి తెలిపినట్లు వివరించారు.