కేరళ కాసరగోడ్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం అది. ఆ ఊరిలోని ఓ ఇంటి వద్ద పెళ్లి వేడుక జరుగుతున్నట్లుగా ఉంది. బంధువుల హడావుడి మధ్య బాజాభజంత్రీలు మోగుతున్నాయి. మరోవైపు.. విందు కోసం గుమగుమలాడే వంటలు సిద్ధం అవుతున్నాయి. అప్పుడే.. 'ముహూర్తం సమీపిస్తోంది.. త్వరగా వధూవరులను పెళ్లిపీటలపైకి తీసుకురండి' అని కేకవేశాడు అక్కడే ఉన్న ఓ పూజారి.
ఆ వెంటనే.. వధూవరులను బంధువులు తీసుకువచ్చారు. అయితే.. అక్కడే ఊహించని ట్విస్టు. వధూవరులు అంటే మనుషులను తీసుకురాకుండా.. రెండు అందంగా అలంకరించిన బొమ్మలను తీసుకువచ్చారు. అవును మరి... ఈ పెళ్లి సాధారణంగా జరిగేది కాదు. చనిపోయిన వారికి జరుగుతున్న పెళ్లి. మరణించిన వారికి వివాహమా? అని ఆశ్చర్యంగా ఉంది కదూ..!
కాసరగోడ్ జిల్లాలోని బడియడుక్క గ్రామంలోని మగోర్ తెగ ప్రజలు.. చాలాకాలంగా ఈ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. వివాహం కాకముందే చనిపోయిన తమ వారికి ఇలా బొమ్మల రూపంలో పెళ్లి జరిపిస్తున్నారు. తద్వారా.. చనిపోయినవారి ఆత్మలు స్వర్గంలో సుఖంగా ఉంటాయని వారు నమ్ముతున్నారు.
అందంగా అలంకరించిన వధువు బొమ్మ ఉత్తుత్తిగా కాదు.. అన్నీ నిజంగానే..
చనిపోయిన వారికి పెళ్లి అంటే.. బొమ్మలకు పెళ్లి చేసి 'మమ' అనిపిస్తారని భావించడానికి వీల్లేదు. సాధారణంగా ఇద్దరు వ్యక్తుల పెళ్లికి ఏమేం చేస్తారో.. అన్నింటినీ ఈ పెళ్లిలో మగోర్ తెగ ప్రజలు పాటిస్తారు. ముందుగా.. పెళ్లి కాకుండా చనిపోయిన తమ యువకుడి పెళ్లి కోసం వారి బంధువులు... పెళ్లికాకుండా చనిపోయిన యువతి ఇంటికి పెళ్లి చూపులకు వెళ్తారు. అక్కడ అన్నీ మాట్లాడుకుని, వివాహానికి ముహూర్తం నిర్ణయిస్తారు.
పెళ్లి మండపాన్ని అలంకరిస్తూ.. చనిపోయినవారి పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్న దృశ్యం ఆ తర్వాత ఆహ్వాన పత్రికలను ముద్రించి.. బంధువులకు వధూవరుల కుటుంబ సభ్యులు అందజేస్తారు. పెళ్లిరోజున మండపాన్ని అందంగా అలంకరించి.. బొమ్మల రూపంలోని ఆ యువ జంటకు పెళ్లి చేసి ఒక్కటి చేస్తారు. సాధారణంగా ఈ కార్యక్రమాన్ని రాత్రిపూట మాత్రమే నిర్వహిస్తారు. పెళ్లికి వచ్చిన అతిథుల కోసం మంచి విందు ఏర్పాటు చేసి, పెళ్లిజంటను దీవించండని కోరుతారు. పెళ్లి తర్వాత.. ఇక వరుడి కుటుంబం, వధువు కుటుంబం ఎవరి దారి వారి చూసుకుంటారనుకునేరు. అలా ఏం కాదు. ఇకపై వాళ్లు ఒకరినొకరు బంధువులుగా భావిస్తారు. వాళ్లింటికి వీళ్లు, వీళ్లింటికి వాళ్లు తరచూ వెళ్తూ ఉంటారు. ఆ బంధాన్ని కొనసాగిస్తారు.
పెళ్లి కాకుండా చనిపోయిన వారికి ఈ రకంగా పెళ్లి చేయకుండా ఉంటే.. చెడు జరుగుతుందని మగోర్ తెగ ప్రజలు చెబుతున్నారు. అందుకే... ఒక వేళ ఎవరైనా చిన్న వయసులోనే చనిపోయినా.. వారి పెళ్లి వయసు వచ్చే వరకు ఆగి, ఇలా పెళ్లి చేస్తామని అంటున్నారు.
ఇదీ చూడండి:ట్రాన్స్ఉమన్తో యువకుడి పెళ్లి.. తల్లిదండ్రులు నో చెప్పినా...