ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూ జైలులో ఉన్న కేరళ జర్నలిస్టు సిద్ధీఖ్ కప్పన్ గురువారం విడుదలయ్యారు. బుధవారం రాత్రి కప్పన్ విడుదల ఉత్తర్వులను జైలు యంత్రాంగం అందుకుంది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో ఆయనకు కోర్టు నుంచి బెయిల్ మంజూరయింది. చట్టపరమైన అన్ని కార్యకలాపాలను పూర్తి చేసిన తర్వాత కప్పన్‌ను విడుదల చేసినట్లు జిల్లా జైలు సూపరింటెండెంట్ అధికారి ఆశిష్ తివారీ తెలిపారు.
"నేను జైలుకు వెళ్లి దాదాపు 28 నెలలు అయ్యింది. చాలా ఇబ్బందుల తర్వాత ఇప్పుడు బయటకు వచ్చాను. జైలు నుంచి విడుదలైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రిపోర్టింగ్ కోసమే నేను హాథ్రస్‌కు వెళ్లా. నాతో ఉన్నవారు నా స్టూడెంట్స్. నా వద్ద పోలీసులకు అభ్యంతకరమైన వస్తువులు ఏమీ లభించలేదు. ల్యాప్‌టాప్, మొబైల్, పెన్ను, నోట్‌ప్యాడ్ మాత్రమే నా వద్ద ఉన్నాయి."
- కేరళ జర్నలిస్టు సిద్ధీఖ్ కప్పన్
2020 సెప్టెంబరు 14న ఉత్తర్‌ప్రదేశ్ హాథ్రస్లో సామూహిక అత్యాచారానికి గురైన ఓ దళిత యువతి ఉదంతాన్ని కవర్ చేసేందుకు అక్టోబర్ 5న జర్నలిస్టు కప్పన్ అక్కడికి బయల్దేరారు. అయితే మార్గమధ్యలో యూపీ పోలీసులు కప్పన్‌ను చట్ట విరుద్ధ కార్యకలాపాల నిషేధ చట్టం కింద అరెస్టు చేశారు. ఆయనతో ఉన్న మరో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. దీంతో కప్పన్ బెయిల్ కోసం అలహాబాద్ హైకోర్టు లఖ్‌నవూ ధర్మాసనానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే అతడి అప్పీలును లఖ్‌నవూ బెంచి కొట్టివేయటం వల్ల కప్పన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టు గతేడాది సెప్టెంబరు 9న కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ను కప్పన్‌కు మంజూరు చేసింది. ఈడీ మనీలాండరింగ్ కేసు కారణంగా ఇంతకాలం జైలులో కొనసాగారు. ఈ కేసులో అతని బెయిల్ కోసం అవసరమైన పూచీకత్తును కోర్టులో బుధవారం సమర్పించారు. ఇద్దరు వ్యక్తులు.. రూ.లక్ష చొప్పున పూచీకత్తును సమర్పించగా.. గురువారం కప్పన్‌ను రిలీజ్ చేశారు. కప్పన్‌ను ఉదయం 9.15 గంటలకు జైలు నుంచి విడుదల చేసినట్లు లఖ్‌నవూ జైలు జైలర్ రాజేంద్ర సింగ్ తెలిపారు. ఆయన ఇప్పటికే సుమారు 28 నెలలపాటు జైలు జీవితం గడిపారు. కప్పన్ జైలులో ఉన్న సమయంలోనే ఆయన తల్లి మరణించింది.