తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వారిని చంపి, వండుకుని తినేసిన భార్యాభర్తలు!'.. నరబలి కేసులో షాకింగ్ నిజాలు - నరబలి కేసులో షాకింగ్​ నిజాలు

సిరిసంపదల ఆశతో ఇద్దరి మహిళల్ని బలి ఇచ్చిన కేసులో మరిన్ని దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మృతుల శరీర భాగాల్ని నిందితులు వండుకుని తిన్నట్లు తెలిసింది. మరికొందరిని ఇదే తరహాలో నరబలి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు వెల్లడైంది. ఈ కేసులో మాంత్రికుడు రషీద్​ అలియాస్ మహ్మద్ షఫీ ప్రధాన నిందితుడని పోలీసులు చెప్పారు. సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని అతడు ఈ దురాగతాలకు పాల్పడ్డాడని వివరించారు.

Kerala Human Sacrifice case The accused cooked and ate body parts of the victims
Kerala Human Sacrifice case The accused cooked and ate body parts of the victims

By

Published : Oct 12, 2022, 1:46 PM IST

Updated : Oct 12, 2022, 2:06 PM IST

Kerala Sacrifice Case: "ఇద్దరు మహిళల్ని బలి ఇచ్చాం. ఆరోగ్యంగా, ఎక్కువ కాలం బతికేందుకు వారి శరీర భాగాలు వండుకుని తినమని మాంత్రికుడు సూచించాడు. మేము అలానే చేశాం".. అంటూ నరబలి కేసులో నిందితులు చెబుతున్న మాటలు విని కేరళ పోలీసుల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సిరిసంపదలు కలుగుతాయన్న ఆశతో భగవల్ సింగ్, అతడి భార్య లైలా అత్యంత కిరాతకంగా, అమానవీయంగా, అజ్ఞానంగా వ్యవహరించిన తీరును తెలుసుకుని నివ్వెరపోయారు. మరో నిందితుడైన మహ్మద్​ షఫీ అలియాస్ మాంత్రికుడు రషీద్​ ఈ కేసులో ప్రధాన కుట్రదారుడని తేల్చారు.

అత్యాశ, అజ్ఞానం, అమానవీయం..
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళ పథనంతిట్ట జిల్లాలో సంచలనం రేపిన జంట హత్యల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నరబలి ఇస్తే ఆర్థికంగా లాభపడతామని ముగ్గురు వ్యక్తులు కలిసి ఇద్దరు మహిళల్ని దారుణంగా చంపిన కేసులో నిందితుల్ని విచారించారు. ఆధారాల సేకరణ కోసం నిందితులైన భగవల్​ సింగ్, లైలాను తిరువళ్లలోని వారి ఇంటికి తీసుకెళ్లారు. మాంత్రికుడు రషీద్ అలియాస్ మహ్మద్​ షఫీ అనే వ్యక్తి సాయంతో ఈ నేరం చేసిన తీరును సింగ్​-లైలా వివరించారు. రషీద్ సూచనల మేరకు మృతుల శరీర భాగాల్ని వండుకుని తిన్నట్లు చెప్పారు.

అయితే.. ఈ విషయంపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉందని బుధవారం మీడియా సమావేశంలో అన్నారు కొచి నగర పోలీస్ కమిషనర్ సీహెచ్. నాగరాజు. "మృతుల శరీర భాగాల్ని నిందితులు తిని ఉండొచ్చు. అయితే.. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోంది. ఇంకా ధ్రువీకరించలేదు. ఈ కేసులో ఇంకెవరైనా నిందితులు ఉన్నారా, ఇలాంటి నేరాలు ఇంకేమైనా జరిగా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. ఇద్దరు మహిళల శరీర భాగాలు అన్నింటినీ రికవర్ చేశాం." అని వెల్లడించారు నాగరాజు.

డబ్బు ఆశ చూపి..
పోలీసుల కథనం ప్రకారం.. కడవంతర, కాలడీకి చెందిన ఇద్దరు మహిళలతో మహ్మద్‌ షఫీ సోషల్‌ మీడియాలో స్నేహం చేశాడు. లాటరీ టికెట్లు విక్రయిస్తూ జీవనం సాగించే పద్మం (52), రోస్లి(50)ని కొద్దిరోజుల క్రితం కిడ్నాప్‌ చేశాడు. అనంతరం భగవల్ సింగ్‌ దంపతులతో కలిసి బలి ఇచ్చాడు.

"ప్రధాన నిందితుడు షఫీ.. ఆర్థికంగా సమస్యల్లో ఉన్న వారిని ఫేస్​బుక్ ద్వారా గుర్తించేవాడు. అలానే భగవల్ సింగ్, లైలా గురించి తెలుసుకున్నాడు. నరబలి ఇచ్చేందుకు వారు సుముఖంగా ఉన్నట్లు కనుగొన్నాడు. ఫేస్​బుక్​లో ఇదంతా చేసేందుకు షఫీ తన భార్య సెల్​ఫోన్ ఉపయోగించాడు. కానీ ఆ విషయం ఆమెకు తెలియదు.
షఫీ ఎవరినైనా లైంగికంగా వేధించాడా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నాం. ఈ నరబలి కాకుండా వేర్వేరు నేరాలకు సంబంధించి షఫీపై 8 కేసులు నమోదయ్యాయి." అని బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు కొచి డీసీపీ ఎస్​.శశిధరన్. ఈ నరబలి కేసుకు ఆయనే ప్రధాన విచారణ అధికారి.

మరింత మందిని నరబలి ఇవ్వాలని నిందితులు భావించినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. తిరువళ్లకు చెందిన ఓ మహిళను ఇందుకోసం షఫీ తీసుకొచ్చాడు. అయితే.. ఆమె తాను ఎక్కడుందన్న వివరాల్ని కుటుంబసభ్యులకు తెలియజేసింది. ఆమెను చంపితే దొరికిపోవడం ఖాయమని భయపడిన నిందితులు.. నరబలి ఆలోచనను విరమించుకున్నారు. అలానే ఓ చిన్నారితో కూడిన కుటుంబాన్ని కూడా షఫీ నరబలి కోసం భగవల్-లైలా ఇంటికి తీసుకొచ్చాడు. అయితే.. వారు ఎవరు, ఏమయ్యారనే విషయంపై స్పష్టత లేదు. పోలీసులు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు.

పోలీసు కస్టడీకి నిందితులు
ఈ కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితుల(భగవల్, లైలా, షఫీ అలియాస్ రషీద్​)ను పోలీసులు బుధవారం ఉదయం ఎర్నాకుళం జిల్లా సెషన్స్​ కోర్ట్​లో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం వారికి 14 రోజుల(అక్టోబర్ 26 వరకు) పోలీస్​ కస్టడీ విధించింది.

మిస్టరీ వీడిందిలా..
హత్యకు గురైన ఇద్దరు మహిళల్లో ఒకరు జూన్​లో, మరొకరు సెప్టెంబర్​లో అదృశ్యమయ్యారు. ఆ ఇద్దరు మహిళల కుటుంబ సభ్యులు.. వేర్వేరుగా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. సెల్​ఫోన్ కాల్ డేటా, టవర్ లొకేషన్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టగా ఈ నరబలి వ్యవహారం బయటపడింది. నరబలి ఇచ్చి, మృతదేహాల్ని ముక్కలు ముక్కలుగా నరికి, పాతేసినట్టు వెల్లడైంది. మంగళవారం పథనంతిట్ట జిల్లా ఎలంతూర్​ గ్రామంలోని భగవల్-లైలా ఇంటి నుంచి ఇద్దరి మృతదేహాల్ని పోలీసులు వెలికితీశారు. నిందితుల్ని అరెస్టు చేశారు.

"మహిళల అదృశ్యంపై తొలుత షఫీని ప్రశ్నించాం. కానీ మాకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. శాస్త్రీయంగా దర్యాప్తు చేస్తే పథనంతిట్ట వైపు మా దృష్టి మళ్లింది. ఈ కేసులో షఫీ ప్రధాన కుట్రదారుడు. అతడు ఓ కామాంధుడని దర్యాప్తులో తెలిసింది." అని వివరించారు పోలీస్ కమిషనర్ నాగరాజు.

ఇవీ చదవండి:'ఆమె' పేరుతో రోడ్డు నిర్మాణం.. పొట్టకూటి కోసం తల్లిదండ్రులే కూలీలుగా మారి..

కుక్క అరుపులు విని భయపడ్డ ఏనుగు, అడవిలోకి పరుగే పరుగు

Last Updated : Oct 12, 2022, 2:06 PM IST

ABOUT THE AUTHOR

...view details