కేరళ ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్న పినరయ్ విజయన్‌కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. రాష్ట్రంలో కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా ప్రమాణస్వీకార వేదికను తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియం నుంచి రాజ్ భవన్‌కు మార్చాలని కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆహ్వానితులను 50 మందికే పరిమితం చేసేలా ఆదేశించాలని పిటిషనర్, డెమొక్రటిక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జార్జి సెబాస్టియన్ కోరారు.
పినరయ్ విజయన్ సీఎంగా.. కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం మరోసారి కొలువుదీరాల్సి ఉంది. అందుకోసం మే 20న కొవిడ్ నిబంధనలతో 50 వేల సామర్థ్యం గల సెంట్రల్ స్టేడియంలో 500 మంది అతిథులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టారు. దీనికి 140 మంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, 29మంది ఎంపీలు, న్యాయశాఖ ప్రతినిధులు, మీడియా హాజరుకానున్నాయి. 48 గంటల్లో కొవిడ్ నెగిటివ్ రిపోర్టు లేదా టీకా తీసుకున్న ధ్రువపత్రం చూపించినవారినే కార్యక్రమానికి అనుమతించనున్నారు.
పార్లమెంటరీ పార్టీ నేతగా..
సీపీఎం పార్లమెంటరీ పార్టీ నేతగా పినరయ్ విజయన్ను మంగళవారం నియమించింది పార్టీ రాష్ట్ర కమిటీ. టీపీ రామకృష్ణన్ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శిగా నియమితులయ్యారు.