Haritha Karma Sena Lottery : అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం. అదృష్టం కలిసొస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారు! అది కేరళకు చెందిన 11 మంది మహిళల విషయంలో నిజమైంది. కనీసం ఒక్కొక్కరి చేతిలో రూ.25 కూడా లేవు. 11 మంది మహిళలు తమ దగ్గరున్న చిల్లరంతా జమచేసి రూ.250తో లాటరీ టికెట్‌కొనుగోలు చేశారు. అదృష్టం కలిసొచ్చి వీరి టికెట్‌కే లాటరీ తగలింది. దీంతో మహిళలు ఏకంగా రూ.10 కోట్ల జాక్‌పాట్ కొట్టేశారు. ఈ మహిళల లక్కీ స్టోరీ ఓ సారి తెలుసుకుందాం పదండి.
చిల్లర పోగేసి లాటరీ టికెట్ కొన్న 11 మంది మహిళా కార్మికులు.. రూ.10కోట్ల జాక్‌పాట్
Haritha Karma Sena Lottery : పొట్టకూటి కోసం ఇంటింటా తిరిగి చెత్త సేకరించే మహిళలకు అదృష్టం వరించింది. రూ.250 పెట్టి వ్యక్తిగతంగా లాటరీ టికెట్ కొనలేక.. అందరూ కలిసి కొనుగోలు చేశారు. మహిళలు కొన్న లాటరీ టికెట్‌కు రూ.10 కోట్ల జాక్‌పాట్ తగిలింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా?
మలప్పురం జిల్లా.. పరప్పణగాడి మున్సిపాలిటీలో హరిత కర్మ సేన అనే విభాగం ఉంది. ఈ బృందంలోని సభ్యులు నేలలో కలిసిపోని వ్యర్థాలను ఇళ్లు, ఆఫీసుల నుంచి సేకరించి రీసైక్లింగ్ కోసం యూనిట్లకు పంపిస్తుంటారు. ఇందులో పనిచేస్తున్న 11 మంది మహిళలు కొద్ది వారాల క్రితం లాటరీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నారు. కానీ వారిలో ఎవరి దగ్గర రూ.250 పెట్టి లాటరీ టికెట్ కొనేంత డబ్బు లేదు. ఈ క్రమంలో తమ దగ్గరున్న చిల్లరనంతా పోగు చేశారు. ఓ మహిళ అయితే తన దగ్గర డబ్బులు లేక వేరే వాళ్ల దగ్గర అప్పు తీసుకుని మరీ ఇచ్చింది.
11 మంది మహిళలు కలిసి రూ.250 జమచేసి లాటరీ టికెట్‌ను కొన్నారు. కేరళ లాటరీ డిపార్ట్‌మెంట్ గత బుధవారం డ్రా తీయగా.. ఈ మహిళలు కొన్న టికెట్‌కే జాక్‌పాట్ తగిలింది. లాటరీ ప్రైజ్ మనీ రూ.10కోట్లు కావడం వల్ల 11 మంది మహిళల ఆనందానికి అవధుల్లేవు. 'మేం ఇంతకుముందు చాలా సార్లు లాటరీ టికెట్లు కొన్నాం. కానీ ఈసారి మేమంతా డబ్బులు జమచేసుకుని కొన్న టికెట్‌కు లాటరీ తగిలింది. మాకు లాటరీ ప్రైజ్ మనీ రావడం ఆనందంగా ఉంది. మేమంతా కుటుంబం కోసం ఎంతో కష్టపడుతున్నాం. మాకొచ్చే జీతంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. మా కుమార్తెల పెళ్లిళ్లు, అప్పులు, ఆరోగ్య సమస్యలు ఇలా ఆర్థికంగా ఎన్నో సమస్యలున్నాయి. ఈ లాటరీ ప్రైజ్‌మనీ డబ్బుతో మా సమస్యలు తీరుతాయి' అని మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.