స్టార్డమ్తో సంబంధం లేకుండా ప్రస్తుతం అతి సామాన్యులు కూడా వారి ప్రతిభకు అనుగుణంగా యూట్యూబ్ ఛానెల్స్‌ను నడుపుతున్నారు. కొందరు వారు రోజూ చేసే ప్రొఫెషనల్ వర్క్ కాకుండా వీటితో కూడా ఎంతో కొంత ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. కొందరు వంటల ఛానెల్స్‌తో సొమ్ము చేసుకుంటుంటే, మరికొందరు కామెడీ వీడియోస్ అప్లోడ్ చేసి లక్షల్లో సంపాదిస్తున్నారు. అయితే ఈ అదనపు ఆదాయ మార్గంపై నిషేధం విధించింది కేరళ ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగం చేసే ఏ ఒక్కరూ ఇకపై యూట్యూబ్ ఛానెల్స్‌ను నిర్వహించవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఆ రాష్ట్ర హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఈ నెల 3న విడుదల చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు షాక్.. యూట్యూబ్ ఛానెళ్లు బంద్ చేస్కోవాల్సిందే!
ప్రభుత్వ ఉద్యోగులకు ఓ రాష్ట్ర సర్కార్ షాక్ ఇచ్చింది. ఇకనుంచి ప్రభుత్వ విధులు నిర్వర్తించే ఏ ఉద్యోగి కూడా యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహించొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల అదనపు సంపాదనను కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.
ప్రభుత్వ ఉద్యోగులు యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించడం.. 'కేరళ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమాలు-1960' చట్టాన్ని ఉల్లంఘించడమేనని జీఓలో పేర్కొన్నారు. కాబట్టి, ప్రభుత్వ ఉద్యోగులకు యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడానికి అనుమతి మంజూరు చేయడం ప్రస్తుత నిబంధనల ప్రకారం సాధ్యం కాదని అడిషనల్ చీఫ్ సెక్రెటరీ వివరణ ఇచ్చారు. ఇలాంటి యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కాగా, తాజాగా సోషల్ మీడియాలో కళాత్మక పనులకు సంబంధించి వీడియోస్ చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి కోరుతూ ఫైర్ రెస్క్యూ సర్వీస్ శాఖ సమర్పించిన దరఖాస్తును నిరాకరిస్తూ అదనపు ప్రధాన కార్యదర్మి ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
యూట్యూబ్‌తో సంపాదనిలా..
ఎవరైనా సరే యూట్యూబ్ ఛానెల్ ద్వారా డబ్బు సంపాదించాలంటే.. వారు ప్రారంభించిన ఛానెల్‌కు గత సంవత్సర కాలంలో కనీసం వెయ్యి మంది సబ్స్క్రైబర్లు కలిగి ఉండాలి. దీంతో పాటు నాలుగు వేల గంటల పాటు వీరు అప్లోడ్ చేసిన కంటెంట్‌ను యూజర్లు వీక్షించాలి. అప్పుడు సదరు ఛానెల్ యజమాని మానెటైజేషన్ ప్రక్రియకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫలితంగా ఆదాయన్ని పొందొచ్చు.