బంగారం స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేశ్ ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. సీఎం, ఆయన కుటుంబ సభ్యులతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆమె చేసిన ఆరోపణలను ముఖ్యమంత్రి కార్యాలయం తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. ఈ మేరకు రెండేళ్ల క్రితం నాటి పలు వీడియోలను విడుదల చేసింది. అప్పటి యూఏఈ కాన్సులేట్ జనరల్‌తో కలిసి స్వప్న సురేశ్ ముఖ్యమంత్రి కార్యాలయానికి పలు మార్లు అధికారిక పని కోసం మాత్రమే వచ్చినట్లు పేర్కొంది.
సామాజిక మాధ్యమాల వేదికగా రెండు భాగాలుగా ఓ చిన్న వీడియోను విడుదల చేసింది సీఎంఓ. తాను ఎవరో తెలియదని సీఎం అబద్ధం చెప్పారని, ఆ విషయాలను బయటపెడతానని స్వప్న సురేశ్ మంగళవారం చేసిన బెదిరింపులను తోసిపుచ్చేందుకు, ఆమె ఒక కాన్సులేట్ ఉద్యోగిగా మాత్రమే తెలుసునన్న విజయన్ మాటలను ధ్రువీకరించే ప్రయత్నం చేసింది సీఎంఓ.
బంగారం స్మగ్లింగ్ కేసు రాజకీయ దుమారం రేపిన క్రమంలో.. 2020, అక్టోబర్ 13న ఓ ప్రెస్మీట్లో పాల్గొన్నారు విజయన్. సీఎం అధికారిక కార్యాలయానికి స్వప్న సురేశ్ వచ్చారా? అని విలేకరి అడిగగా.. ఆమె యూఏఈ కాన్సులేట్ జనరల్‌తో అధికారిక పనిపై పలుమార్లు తన కార్యాలయానికి వచ్చినట్లు ఎలాంటి బెరుకు లేకుండా చెప్పారు సీఎం. 'కాన్సులేట్ జనరల్ అధికారిక పనిపై సీఎం కార్యాలయానికి వచ్చినప్పుడు ఆయన సెక్రెటరీగా ఆమె సైతం వచ్చారు. ఒక కాన్సులేట్ జనరల్‌ను ముఖ్యమంత్రి కలవటం తప్పేమీ కాదు.' అని సమాధానమిచ్చారు.
కేరళ ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలు..బంగారం స్మగ్లింగ్ కేసులో స్వప్న సురేశ్, సందీప్ నయర్ను 2020, జులై 11న కస్టడీలోకి తీసుకుంది జాతీయ దర్యాప్తు సంస్థ. 16 నెలల జైలు జీవితం తర్వాత గత ఏడాది నవంబర్‌లో విడుదలైంది స్వప్న సురేశ్. స్వప్న సురేశ్ ఇటీవల ఒక విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, ఆయన భార్య కమల, కుమార్తె వీణ, మాజీ ఐఏఎస్ శివశంకర్, మాజీ చీఫ్ సెక్రటరీ నళినీ నెట్టో, ఆఫీస్ కార్యదర్శి రవీంద్రన్‌కు బంగారం స్మగ్లింగ్ కేసులో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు చేసింది. అంతేకాదు తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నట్లు తరచూ ప్రకటనలు చేస్తోంది. దీంతోపాటు కేసుకు సంబంధించిన వివరాలంటూ పలు అంశాలను ప్రస్తావిస్తోంది. ఇవి ప్రస్తుతం కేరళ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.
అసలు స్వప్నా సురేష్ ఎవరు..?కేరళ నుంచి అబుదాబీకి వెళ్లిన ఓ కుటుంబంలో స్వప్న జన్మించింది. ఆమె అరబిక్ భాషను అనర్గళంగా మాట్లాడగలదు. దీంతో ఆమె అబుదాబీ ఎయిర్‌పోర్టులో ప్యాసింజర్ సర్వీస్ విభాగంలో కొన్నాళ్లు పనిచేసింది. 2013లో ఎయిర్ ఇండియా స్టేట్ ఎయిర్‌పోర్టు సర్వీస్‌లో హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా చేరింది. అక్కడ ఒక ఎయిర్‌పోర్టు ఉద్యోగిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసేందుకు సహోద్యోగితో కలిసి కుట్రపన్నినట్లు ఈమెపై కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తును తన పరపతిని వాడుకొని అడ్డుకొంది. 2016లో కేరళలోని కాన్సులేట్ జనరల్ ఆఫీస్‌లో పీఆర్‌ఓగా చేరింది. కేరళ వాసులు ఎక్కువగా గల్ఫ్ దేశాల్లో ఉండటంతో.. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం యూఏఈ దౌత్య కార్యాలయంతో సన్నిహిత సంబంధాలను నెరుపుతుంది. ఈ నేపథ్యంలో స్వప్న రాజకీయ, బ్యూరోక్రటిక్ సర్కిల్‌లో పరిచయాలను పెంచుకొంది. కానీ, ఆమెపై క్రిమినల్ కేసు కారణంగా.. 2019లో ఆ ఉద్యోగం నుంచి తొలగించారు. కానీ, అప్పటికే ఐఏఎస్ అధికారులతో ఉన్న పరిచయాల కారణంగా ‘కేరళ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌లో ఉద్యోగం సంపాదించారు. దీనికి నాటి ఐటీ సెక్రటరీ శివశంకర్ సహకరించారు. వాస్తవానికి ఆమె 12వ తరగతి మాత్రమే పూర్తి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆమె దాదాపు 16 నెలలు జైలు జీవితం గడిపి గతేడాది విడుదలైంది. వడక్కంచెరిలో యూఏఈ నిధులతో నిర్మించ తలపెట్టిన లైఫ్ మిషిన్ ప్రాజెక్టులో లంచాలు స్వీకరించినట్లు కూడా స్వప్నపై ఆరోపణలు వచ్చాయి.