పెద్దవాళ్లు కథలు చెబుతుంటే చిన్నారులు ఆ కథలను ఎంతో ఆసక్తిగా వింటుంటారు. ఏమైనా సందేహాలు వస్తే వాటిని నివృత్తి చేసుకుంటారు. కేరళకు చెందిన ఓ చిన్నారి కూడా తన తల్లి చెప్పిన కథలను శ్రద్ధగా వినేది. కానీ, అందరిలా సందేహాలు అడిగి తెలుసుకునే దగ్గరే ఆగిపోలేదు. తన తల్లి చెప్పిన కథలకన్నా మంచి కథలు రాయాలని ప్రతినబూనింది. అంతే... 13 ఏళ్ల వయసు వచ్చే సరికి ఏకంగా 12 నవలలు రాసి అందరినీ అబ్బురపరిచింది. కేరళ కసార్గాడ్కు చెందిన ఆ బాలిక పేరే సినషా. ఎనిమిదో తరగతి చదువుతోన్న ఆమె... ఆంగ్ల, మలయాళ బాషల్లోనూ నవలలు రాయడం విశేషం.
డైరీతో మొదలై...
సినషా తల్లి... తొలుత రష్యన్ చిన్నపిల్లల కథలు చదివి వాటి అర్థం చెబుతుండేది. ఈ క్రమంలోనే సినషాకు కథలపై ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో రోజు డైరీ రాయడం అలవాటు చేసుకుందీ బాల రచయిత్రి. నెమ్మదిగా ఆ ఆసక్తిని నవలలు రాయడంపైకి మలిచింది.
"సినషా ప్రతిభ చిన్న వయసులోనే వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో తను నేర్చుకున్న విద్యకు ప్రతిఫలం ఇది. నిద్రలో తను కన్న కలలను కూడా సినషా కథలుగా మార్చింది."
- శ్రీహరి కుమార్, బాలిక తండ్రి.