కేరళలోని ఉత్తర మలబార్ వాణిజ్య కేంద్రంగా పేరుగాంచిన పాళంగోడ్.. ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కింది. కన్నూర్‌లోని చెరుకున్ను ప్రాంతానికి చెందిన ఓ బాలిక ఫుట్‌బాల్ జగ్లింగ్లో ప్రపంచ రికార్డు నెలకొల్పడం వల్ల ఈ ఖ్యాతి దక్కింది. పదమూడేళ్లకే ఫుట్‌బాల్ క్రీడపై ఆసక్తి పెంచుకున్న అఖిల.. జగ్లింగ్లో ప్రపంచ రికార్డును తిరగరాసింది. ఒక్క నిమిషం వ్యవధిలో 171 సార్లు బంతిని నేలకు తాకనివ్వకుండా తన కాళ్లపై ఆడిస్తూ ఈ ఘనత సాధించింది అఖిల. ఫలితంగా బ్రెజిలియన్ జగ్లర్ జోషువా డ్యురెట్టే పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది.
కన్నూర్‌లోని స్పోర్ట్స్ డివిజన్ స్కూల్లో ఏడో తరగతి చదువుతోన్న అఖిల.. పిన్న వయసులోనే రాష్ట్ర క్రీడా శిక్షణా కార్యక్రమం 'కిక్ ఆఫ్'లో తర్ఫీదు పొందింది. ఇలా తన నైపుణ్యానికి శిక్షణను కలబోసి బంతిపై కాళ్లపై ఆడించే ఆటలో మరింత రాటుదేలిందీ బాలిక.