ఆరేళ్ల బాలుడిని హత్య చేసి, అతడి 14 ఏళ్ల సోదరిని అత్యాచారం చేసిన కేసులో ఓ వ్యక్తికి మరణశిక్షతో పాటు ఏకంగా 92 సంవత్సరాల జైలుశిక్ష విధించింది కేరళలోని ఇడుక్కి స్పెషల్ పోక్సో కోర్టు. దీంతో పాటు బాలిక కిడ్నాప్, రేప్ సహా ఆమె తల్లి, బామ్మపై దాడి కేసుల్లో విడివిడిగా నాలుగు యావజ్జీవ శిక్షలు విధించింది న్యాయస్థానం. వీటితో పాటు ఇతర సెక్షన్ల కింద కోర్టు వేసిన శిక్షా కాలం కలిపితే 92 సంవత్సరాలు అవుతుంది. ఈ శిక్షతో పాటు దోషికి రూ.9,91 లక్షల జరిమానా సైతం వేసింది. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే.. మరో 11 సంవత్సరాలు అదనంగా శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చింది. దాదాపు 73 మంది సాక్షులను విచారించిన కోర్టు.. ఘటన జరిగిన తర్వాత 20 నెలలకు తీర్పునిచ్చింది.
ఇదీ జరిగింది
ఈ ఘటన ఇడుక్కి జిల్లాలోని అణాంచల్ సమీపంలో జరిగింది. 2021 అక్టోబర్ 2న తెల్లవారుజామున 3 గంటలకు తలుపులు పగులగొట్టి బాధితుల ఇంట్లోకి ప్రవేశించాడు దోషి. మొదట ఆరేళ్ల బాలుడి తలపై సుత్తితో కొట్టి చంపాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న వృద్ధురాలిపై దాడి చేశాడు. అనంతరం పక్క గదిలో ఉన్న మహిళ తలపైనా దాడి చేశాడు. అక్కడే ఉన్న 14 ఏళ్ల బాలికను షెడ్లోకి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లి చుట్టుపక్కల వారికి చెప్పడం వల్ల ఈ విషయం బయటపడింది. దోషి.. బాధితుల బంధువేనని.. కుటుంబ వివాదాల కారణంగానే ఇలా చేశాడని దర్యాప్తులో తేలింది.