కరోనా మహమ్మారి ఎంతోమందిని పొట్టనపెట్టుకుంటోంది. ఆర్థిక స్తోమత సరిగా లేక, వైరస్‌తో పోరాడలేక కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనే ముంబయిలో జరిగింది. కేరళాకు చెందిన నవ దంపతులు కరోనా భయంతో ఆత్మహత్య చేసుకున్నారు.
అజయ్ కుమార్, సుజాల పెళ్లినాటి ఫొటో ఇదీ జరిగింది..
కేరళాకు చెందిన అజయ్ కుమార్, సుజాలు 10 నెలల క్రితం వివాహం చేసుకున్నారు. ఉపాధి నిమిత్తం మహారాష్ట్ర ముంబయి లోవర్ పేరల్ ప్రాంతంలోని భారత్ టెక్స్టైల్ మిల్ టవర్‌లో నివాసం ఉంటున్నారు. కుమార్ నావీ ముంబయిలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తుండగా.. సుజా ఓ ప్రైవేటు బ్యాంకులో విధులు నిర్వర్తిస్తోంది.
శుక్రవారం ఇంట్లో భార్యభర్తలు మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వంట గదిలో భర్త, బాత్రూమ్ ముందు భార్య మృతదేహాలను గుర్తించారు. గదిలో సూసైడ్ నోట్ లభించిన నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు.
సూసైడ్ నోట్ ప్రకారం.. ఇరువురికి ఈ ఏడాది ఏప్రిల్‌లో కరోనా వైరస్ సోకింది. దాంతో వారు సొంత ఊరికి వెళ్లిపోయారు. వైరస్ నుంచి కోలుకున్నాక తిరిగి ముంబయికి వచ్చారు. అయితే.. ఇటీవల మళ్లీ వైరస్ బారినపడ్డట్లు లక్షణాలు గుర్తించారు. దాంతో చికిత్సకు ఆర్థిక స్తోమత సరిపోదనే భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసుకొచ్చారు.
మృతదేహాలను ముంబయిలోని నాయర్ ఆసుపత్రికి తరలించారు. శవపరీక్ష నివేదిక తర్వాత అసలు కారణం తెలుస్తుందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలు వేరు వేరు చోట్ల ఉండటంపై అనుమానిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి:కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో పెరుగుతున్న గుండె పరిమాణం!