అభిమాన తారలు లేదా క్రీడాకారుల పేర్లను తమకు పుట్టిన పిల్లలకు పెట్టుకుని మురిసిపోతుంటారు కొందరు వ్యక్తులు. ఇలాంటి వల్లమాలిన అభిమానానికి మరో ఉదాహరణగా కేరళకు చెందిన ఓ జంట నిలుస్తోంది. ప్రస్తుతం ఫిఫా ప్రపంచకప్ జరుగుతోన్న సమయంలో తమ చిన్నారికి మెస్సీ అని నామకరణం చేసి తమ అభిమానాన్ని చాటుకుంది ఆ జంట.
భారత్‌లో పుట్టిన మరో 'మెస్సీ'!.. అభిమానాన్ని చాటుకున్న కేరళ జంట - కొడుక్కి మెస్సీ అని నామకరణం చేసిన జంట
ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో తమ అభిమానాన్ని చాటుకుంది ఓ జంట. అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ పేరును తమ తనయుడికి పెట్టి ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది.
![భారత్‌లో పుట్టిన మరో 'మెస్సీ'!.. అభిమానాన్ని చాటుకున్న కేరళ జంట Kerala couple names newborn 'Messi' during Argentina-Saudi Arabia match](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17025052-thumbnail-3x2-messi.jpg)
కేరళ తిస్సూర్లోని చాలకుడికిలోని ఓ ఇండోర్ స్టేడియంలో ఫిఫా ప్రపంచ కప్ మ్యాచ్‌ను ప్రదర్శిస్తున్నారు. అర్జెంటీనాకు సౌదీకి మధ్య జరుగుతున్న హోరా హోరీ మ్యాచ్‌కు తిలకించేందుకు ఆ స్టేడియానికి వందల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. సరిగ్గా అదే సమయంలో షానీర్, ఫాతిమా జంట అక్కడి వచ్చి మ్యాచ్ తిలకించారు. ఆ తర్వాత తమ తనయుడికి మెస్సీ అని నామకరణం చేశారు. పెద్దల సమక్షంలో కేక్ కట్ చేసి అందరికి పంచారు.
రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్న ఈ జంటకు అర్జెంటీనా టీమ్‌లోని లియోనల్ మెస్సీ అంటే ఎంతో ఇష్టం. ఆ అభిమానంతోనే తమ పిల్లాడికి ఇదిన్ మెస్సీ అని నామకరణం చేసి సంబరాలు చేసుకున్నామని షానీర్ తెలిపారు. తమ ఫేవరెట్ టీమ్ ఓటమి పాలైనందుకు నిరాశగా ఉన్నా తమ చిన్నారికి మెస్సీ అని పేరు పెట్టడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.