Kerala couple suicide: కేరళలోని పథనంతిట్ట జిల్లాలో ఓ వింత ఒప్పందం కుదుర్చుకున్నారు ప్రేమికులు. ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే ప్రియుడు ముందుగా కొన్ని మాత్రలు మింగి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కానీ ప్రేయసి మాత్రం భయంతో వెనక్కి తగ్గి తన ప్రాణాలను కాపాడుకుంది.
ఆత్మహత్యకు ప్రేమజంట ప్లాన్.. ఉరేసుకున్న ప్రియుడు.. భయంతో యువతి వెనకడుగు - కేరళలో వింత ఒప్పందం కుదుర్చుకున్ని ప్రేమికులు
ఎవరైనా ప్రేమికులు పెళ్లిచేసుకుని కలిసి జీవించాలనుకుంటారు. కానీ కేరళకు చెందిన ప్రేమికులు మాత్రం కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. అంతేగాక ఆత్మహత్య చేసుకుందామని ఓ ఒప్పందానికి సైతం వచ్చారు. ఒప్పందం ప్రకారం ఆ యువకుడు ఉరేసుకోగా.. యువతి మాత్రం భయపడి వెనక్కి తగ్గింది.
పథనంతిట్ట జిల్లాకు చెందిన 31 ఏళ్ల యువకుడు.. రాజధాని తిరువనంతపురానికి చెందిన ఓ యువతి గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఇద్దరికి ఓ వింత ఆలోచన తట్టింది. ఇరువురు కలిసి ఆత్మహత్య చేసుకుందామని ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఒప్పందం ప్రకారమే ఆదివారం స్థానికంగా ఉన్న ఓ హోటల్లో గది అద్దెకు తీసుకున్నారు. సోమవారం రాత్రి వాళ్లిద్దరు చనిపోవాలని నిర్ణయించుకున్నారు.
దీంతో వెంట తెచ్చుకున్న మాత్రలను ప్రేమికులు మింగేశారు. కొద్దిసేపటికి ప్రియుడు ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడు శవాన్ని చూసిన యువతి భయంతో కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న హోటల్ సిబ్బంది.. లోపలికి వెళ్లగా వేలాడుతున్న యువకుడు మృతదేహం కనపడింది. అక్కడే చెవిలో నుంచి రక్తం కారుతున్న అమ్మాయిని చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే హోటల్ సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని హుటాహుటిన స్థానికంగా ఉండే ఆసుపత్రికి తరలించగా వారు కొట్టాయంలోని వైద్య కళాశాల ఆసుపత్రికి తీసుకుపోవాల్సిందిగా సూచించారు.