చిన్నారుల అశ్లీల దృశ్యాల(చైల్డ్ పోర్నోగ్రఫీ)కి సంబంధించిన కేసులో 28 మందిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లేనని చెప్పారు. చిన్నారులకు సంబంధించిన అశ్లీల దృశ్యాలను వీక్షించటమే కాకుండా.. ఇతరులకూ వాటిని షేర్ చేస్తున్నారని వెల్లడించారు. చైల్డ్ పోర్నోగ్రఫీ కట్టడి కోసం చేపట్టిన 'ఆపరేషన్ పీ-హంట్ 21.1'లో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు. మొత్తం 370 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
"జిల్లా పోలీసు చీఫ్‌ల నేతృత్వంలోని 310 మంది సభ్యుల పోలీసు బృందం ఆదివారం ఉదయం ఈ తనిఖీలు చేపట్టాయి. ఏకకాలంలో కేరళలోని 477 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాం. నిందితుల వద్ద నుంచి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, మెమొరీ కార్డులు సహా మొత్తం 429 పరికరాలను స్వాధీనం చేసుకున్నాం. ఈ పరికరాల్లో చైల్డ్ పోర్నోగ్రఫీని వారు భద్రపరిచారు. అరెస్టు చేసిన వారిలో చాలా మంది ఐటీ రంగంలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తున్నవారే."
-మనోజ్ అబ్రహమ్, సైబర్ డోమ్ నోడల్ అధికారి