Kerala Blast Today :కేరళ కలమస్సేరిలోని కన్వెన్షన్ సెంటర్లో జరిగిన భారీ వరుస పేలుళ్ల ఘటనలో దర్యాప్తును ముమ్మరం చేశారు అధికారులు. ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కూడా రంగంలోకి దిగగా.. పేలుడుకు తనదే బాధ్యతను ఒక వ్యక్తి లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తి సాక్ష్యాలతో పాటు వచ్చి త్రిస్సూర్‌లోని కొడకర పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు శాంతిభద్రతల డీజీపీ ఎమ్ఆర్ అజిత్ కుమార్ తెలిపారు. ఇతడు క్రైస్తవ మతానికి చెందిన జెహోవా వర్గం వ్యక్తేనని చెప్పుకున్నాడని.. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నామని డీజీపీ చెప్పారు.
మరోవైపు లొంగిపోవడానికి ముందు మార్టిన్ ఫేస్బుక్లో ఓ వీడియోను సైతం పోస్ట్ చేశాడు. చిన్నారుల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే ద్రోహులు అంటూ జెహోవా విట్నెసెస్ గురించి ఇందులో మాట్లాడాడు. వారందరూ మనుషులకు కీడును కోరుకుంటున్నారని.. దీనిని మార్చుకోవాలని 16 ఏళ్లుగా చెప్పానని, కానీ వాళ్లు వినలేదని అన్నాడు.
దర్యాప్తులో ఆ బ్లూ కారు కీలకం!
మరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న NIA అధికారులు.. పోలీసులతో కలిసి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీని తీసుకున్నారు. అయితే, ఈ దర్యాప్తులో ఓ బ్లూ కారు కీలకంగా మారింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో నీలం రంగు కారు అనుమానాస్పదంగా సంచరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న ఓ మతపరమైన కార్యక్రమానికి భక్తులు రాకముందే.. కారు అక్కడికి వచ్చిందని అధికారులు గుర్తించారు. కానీ, పేలుడు జరగడానికి కొద్ది సమయం ముందే అక్కడి కారు అక్కడి నుంచి వెళ్లడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఈ క్రమంలోనే పేలుడుకు సంబంధించిన నిందితుడు ఈ కారులోనే వచ్చాడని అనుమానిస్తున్నారు అధికారులు. అయితే, ఈ కారుకు సంబంధించిన వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. మరికొందరు సాక్షులు మాత్రం.. ఓ వ్యక్తి బ్యాగును పట్టుకుని హాల్ ప్రాంగణంలోనే తిరిగినట్లు చెబుతున్నారు.
"నేను ప్రార్థన చేస్తూ కళ్లు మూసుకున్నాను. భారీ పేలుడు శబ్దం వినిపించడం వల్ల నా కళ్లు తెరిచాను. ఓ భారీ అగ్నిగుండం నా కళ్లు ముందు ఉంది. హాల్ మొత్తం మంటలు తప్ప మరేమీ కనిపించలేదు. అందరూ హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీశారు."
--ప్రత్యక్ష సాక్షి
"నేను హాల్లో కళ్లు మూసుకుని ప్రార్థన చేస్తున్నాను. నా సమీపంలో ఒక్కసారిగా ఓ భారీ పేలుడు జరిగింది. కళ్లు తెరిచి చూసేసరికి చుట్టూ మంటలు ఉన్నాయి. అందరూ పరుగెడుతుండగా.. వారితో నేను బయటకు వచ్చాను. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ప్రార్థనల కోసం వస్తున్నాను. కానీ ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరగలేదు."