బ్యాంకు ఉద్యోగుల ఉదారత- రికవరీ కోసం వెళ్లి.. రుణం తీర్చి Bank Officials Clear Loan and Rebuilt House: తీసుకున్న రుణం కట్టడం లేదని, రికవరీలో భాగంగా ఇంటిని జప్తు చేసేందుకు వెళ్లిన బ్యాంకు ఉద్యోగులు అక్కడి పరిస్థితి చూసి చలించిపోయారు. ఇంటిని జప్తు చేయడానికి బదులుగా సొంత ఖర్చుతో పునర్నిర్మించారు. తీసుకున్న రుణం చెల్లించి వారికి ఓ ఆధారం కల్పించారు. ఈ ఘటన కేరళలోని కోజికోడ్ జిల్లాలో జరిగింది.
ఉద్యోగులు పునర్నిర్మించిన ఇల్లు ఇదీ జరిగింది..
కోజికోడ్ జిల్లా కప్పాడ్కు చెందిన శశి అనే వ్యక్తి.. తన తల్లి సరోజినీతో కలిసి ఓ చిన్న ఇంట్లో నివసిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం బ్యాగుల తయారీ పరిశ్రమ పెట్టుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు. కొన్ని రోజులకు శశి పక్షవాతానికి గురికాగా.. అప్పు తీర్చలేకపోయాడు.
శిథిలావస్థకు చేరుకున్న ఇల్లు బకాయిలతో కలిపి తీసుకున్న అప్పు మొత్తం రూ.70,000లకు చేరుకుంది. సరైన సమయానికి వడ్డీ, అసలు చెల్లించకపోవటం వల్ల బ్యాంకు ఉద్యోగులు వారి ఇంటిని జప్తు చేయాలని నిర్ణయించారు. స్థానిక ఎస్‌బీఐ మేనేజర్ ఎం. మురహరి.. తన సిబ్బందితో కలిసి ఓరోజు శశి ఇంటికి వెళ్లారు. అతని పరిస్థితి, ఇంటిని చూసి చలించిపోయారు. ఏ క్షణంలోనైనా కూలిపోయే ఇంటిలో తల్లితో కలిసి జీవిస్తున్నాడు శశి. మరుగుదొడ్డి లేదు, ఇంటి పైకప్పు పూర్తిగా పాడైపోయింది. శశి నిస్సహాయ స్థితిని గమనించిన బ్యాంకు మేనేజర్ మురహరి.. ఓ నిర్ణయానికి వచ్చారు.
బ్యాంకుకు తిరిగి వచ్చాక.. ఈ సంఘటన గురించి తన సహోద్యోగులతో చర్చించారు మురహరి. శశి ఇంటిని పునర్నిర్మించాలని సంకల్పించారు. తొమ్మిది మంది బ్యాంకు ఉద్యోగులు తమ సొంత నగదుతో ఇంటిని బాగు చేయించారు. మరోవైపు.. 2021, మార్చిలో నిర్వహించిన బ్యాంక్ అదాలత్.. వన్-టైమ్ సెటిల్‌మెంట్ ప్లాన్ కింద శశి బకాయిలు రూ.70 వేలను చెల్లించారు.
బ్యాంకులో పని ముగించుకుని ఉద్యోగులే స్వయంగా ఇంటికి కావాల్సిన రాళ్లు, ఇసుక, సిమెంట్‌ను శశి ఇంటికి తీసుకొచ్చేవారు. వంటగది, మరుగుదొడ్డిని కొత్తగా కాంక్రీట్‌తో నిర్మించారు. బ్యాంకు మేనేజర్ ఎం. మురహరితో పాటు ఉద్యోగులు జనార్దనన్, అశ్విన్ ఎం మోహన్, ప్రశాంత్ కృష్ణ, అభినవ్ దేవ్, సతీశన్, చంద్రన్, రమ్య, అనుశ్రీ ఇందులో భాగమయ్యారు.
ఇదీ చదవండి:చుట్టూ గొయ్యి.. ఇంట్లోకి వెళ్లాలంటే నిచ్చెనే దిక్కు.. ఓనర్ 'రివెంజ్'తో...