తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గవర్నర్​కు సర్కారు షాక్.. యూనివర్సిటీల ఛాన్స్​లర్​గా తొలగింపు!.. అసెంబ్లీలో బిల్లు పాస్ - కేరళ ప్రభుత్వం కొత్త బిల్లు

కేరళ ప్రభుత్వం యూనివర్సిటీ ఛాన్స్​లర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్​ను ఆ బాధ్యతల నుంచి తొలగిస్తూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది.

kerala assembly passes bill of university vcs
kerala assembly passes bill of university vcs

By

Published : Dec 13, 2022, 5:51 PM IST

Updated : Dec 13, 2022, 7:37 PM IST

రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు ఛాన్సలర్​గా వ్యవహరించే గవర్నర్​ను ఆ బాధ్యతల నుంచి తొలగించే బిల్లుకు కేరళ అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. మంగళవారం జరిగిన అసెంబ్లీ​ సమావేశంలో ఈ బిల్లు ఆమోదం పొందిందని స్పీకర్​ ఏఎన్​ శ్యాంసీర్ ప్రకటించారు. గవర్నర్ స్థానంలో విద్యారంగంలో నిపుణులను ఛాన్స్​లర్​గా నియమించనున్నట్లు బిల్లులో పేర్కొన్నారు.

అంతకుముందు, బిల్లుపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. బిల్లుకు విపక్షం సైతం అనుకూలంగానే స్పందించింది. అయితే, దీనిపై పలు సవరణలు ప్రతిపాదించింది. ఛాన్స్​లర్​గా గవర్నర్​కు బదులుగా ఆ స్థానంలో.. సుప్రీంకోర్టు రిటైర్డ్​ న్యాయమార్తి లేదా.. కేరళ హైకోర్టు రిటైర్డ్​ సీజే ఉండాలని కోరింది. వారిని ఎంపికచేసే కమిటీలో సీఎం, ప్రతిపక్ష నేత, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలని సూచించింది. అయితే, ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. దీంతో విపక్ష నాయకులు సభను బహిష్కరించారు.

న్యాయమూర్తులు ఈ ప్యానల్​ కమిటీలో ఉండాల్సిన అవసరం లేదని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి రాజీవ్​ అన్నారు. దానికంటే ఆ కమిటీలో స్పీకర్ ఉంటే మంచిదని తెలిపారు. గవర్నర్​ స్థానాన్ని భర్తీ చేయడానికి రిటైర్డ్​ జడ్జ్​లు మాత్రమే ప్రత్యామ్నాయం కాదని మంత్రి అన్నారు.

కేరళలోని విజయన్ ప్రభుత్వానికి, గవర్నర్ ఆరిఫ్​ మహమ్మద్​ ఖాన్​​కు మధ్య కొంతకాలంగా వేర్వేరు అంశాలపై వివాదాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల ఉపకులపతుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. తొమ్మిది యూనివర్సిటీల వీసీలను రాజీనామా చేయాలని గవర్నర్​ ఆదేశాలు జారీ చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. గవర్నర్​కు అలా ఆదేశించే అధికారాలు లేవని సీఎం ఎదురుదాడికి దిగారు. దీనికి ప్రత్యమ్నాయంగానే కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Last Updated : Dec 13, 2022, 7:37 PM IST

ABOUT THE AUTHOR

...view details