కేరళలో శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం ఆరు గంటల వరకు 73.58 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
కరోనా జాగ్రత్తల నడుమ ఈసీ ఓటింగ్ నిర్వహించింది. ఉదయం నుంచే ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి, ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 140 స్థానాల నుంచి పోటీకి దిగిన 957 మంది అభ్యర్థులు భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.
ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రతిపక్షనేత రమేశ్ చెన్నితల , సీనియర్ కాంగ్రెస్ నేత ఉమన్ చాందీ , భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్, ఆ పార్టీ నేత 'మెట్రోమ్యాన్' శ్రీధరన్.. వారివారి పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పోలింగ్ కేంద్రం వద్ద సీఎం పినరయి విజయన్ ఓటు హక్కు వినియోగించుకుంటున్న శ్రీధరన్ ఓటు హక్కు వినియోగించుకున్న రమేశ్ చెన్నితల కన్నూర్‌లో ఘర్షణ..
కన్నూర్ జిల్లా పయన్నూర్ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రంలో స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. ప్రిసైడింగ్ అధికారి మహమ్మద్ ఆష్రఫ్ కలాతిల్పై సీపీఎం కార్యకర్తలు దాడి చేశారు. చికిత్స నిమిత్తం ఆష్రఫ్ను ఆస్పత్రికి తరలించారు. రేషన్ కార్డుతో ఓటు వేయడానికి వచ్చిన ఓ వ్యక్తిని అడ్డుకున్నందుకే ఈ దాడి జరిపినట్లు సమాచారం.
ఇద్దరు వృద్ధులు మృతి..
పథనమ్‌తిట్ట జిల్లా అరన్ముల పోలింగ్ కేంద్రం, కొట్టాయం జిల్లా చవిట్టువరీ పోలింగ్ కేంద్రం వల్ల విషాదం నెలకొంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓ 65 ఏళ్లు వ్యక్తి, 75 ఏళ్లు మహిళ అకస్మాత్తుగా సృహతప్పి పడి.. ప్రాణాలు కోల్పోయారు.
కేరళ శాసనసభ ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి.
ఇదీ చదవండి :'టీఎంసీ అభ్యర్థులపై భాజపా దాడులు!'