దేశ రాజధాని దిల్లీలో విద్యుత్తు సంక్షోభం(delhi power crisis) తలెత్తే అవకాశం ఉందని స్వయంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు(arvind kejriwal news). అయితే, దీన్ని తప్పించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని తెలిపారు(delhi power cut news). అలాగే ఈ విషయంలో కేంద్రం జోక్యాన్ని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాశామన్నారు. థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు సరిపడా బొగ్గు, గ్యాస్ నిల్వల్ని అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశామన్నారు.
ఆగస్టు నుంచే దిల్లీలో బొగ్గు కొరత ఉందని ప్రధానికి రాసిన లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు. వరుసగా మూడో నెల ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళుతున్నామని తెలిపారు. బొగ్గు నిల్వలు అడుగంటిపోవడం వల్ల దిల్లీకి విద్యుత్తు సరఫరా చేస్తున్న కేంద్రాలన్నింటిలో ఉత్పత్తి దెబ్బతిందని పేర్కొన్నారు.
మరోవైపు గిరాకీకి అనుగుణంగా బొగ్గు సరఫరా(coal shortage) అందకపోతే.. రెండు రోజుల్లో దిల్లీలో భారీ విద్యుత్తు కోతలు తప్పవని దిల్లీ ఇంధన శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. అలాగే దిల్లీ ఉత్తర, వాయువ్య ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా చేస్తున్న 'టాటా పవర్ దిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్(టీపీడీడీఎల్)' సైతం విద్యుత్తు కోతలు తప్పవేమోనని వినియోగదారులకు ముందు జాగ్రత్త హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత కారణంగా గిరాకీకి అనుగుణంగా విద్యుత్తు ఉత్పత్తి చేయలేకపోతున్నామని తెలిపింది. ఈ నేపథ్యంలో విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వినియోగదారులకు సంక్షిప్త సందేశాలు పంపింది.
దేశంలోని థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో నిబంధనల ప్రకారం 23 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి. కానీ, ప్రస్తుతం మూడు రోజులకు సరిపోయేలా మాత్రమే నిల్వలున్నాయని ఇంధన శాఖ గణాంకాలు చెబుతున్నాయి. తమిళనాడు, ఒడిశా ప్రభుత్వాలు సైతం ఇప్పటికే బొగ్గు నిల్వలలపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్రానికి సమాచారం ఇచ్చాయి.
ఇదీ చూడండి:-'3వేల కిలోల డ్రగ్స్' కేసులో కీలక పత్రాలు స్వాధీనం