Kejriwal ED Summon News :లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ విచారణకు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ గైర్హాజరు అయ్యారు. తాను విచారణకు రావడం లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు సమాచారం ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన సమయం చూస్తే తనను 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేసుకోనీయకుండా అడ్డుకునేందుకే ఇచ్చారని అర్థమవుతోందని కేజ్రీవాల్ సమాధానం ఇచ్చినట్లు ఆప్ వర్గాలు తెలిపాయి. విచారణకు సహకరించేందుకు కేజ్రీవాల్ సిద్ధంగానే ఉన్నారని, అయితే ఈడీ ఇచ్చిన నోటీసులు చట్టవిరుద్ధమని ఆరోపించాయి.
"రెండుసార్లు సమన్లు అందుకున్న తర్వాత ఈడీకి కేజ్రీవాల్ లేఖ రాశారు. ఎందుకు తనను పిలుస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటివరకు కేజ్రీవాల్ ప్రశ్నకు ఈడీ సమాధానం ఇవ్వలేదు. సమన్లు చట్టవిరుద్ధమని ఈడీ అధికారులకు కూడా తెలుసు. బీజేపీ కార్యాలయం నుంచి తమకు ఆదేశాలు వచ్చాయన్న నిజాన్ని వారు చెప్పలేరు. ప్రస్తుతం ఇండియా కూటమికి చెందిన నేతలకే సమన్లు ఇస్తున్నారు. ఏడాదిన్నరగా దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఒక్క రూపాయి కూడా దొరకలేదు. లోక్‌సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టే సమన్లు జారీ చేశారు. లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు ఏకం కావడాన్ని చూసి ఈడీ ద్వారా విపక్షాలను బెదరగొట్టాలని బీజేపీ చూస్తోంది."
-అతిషీ, దిల్లీ మంత్రి
మోదీ ప్రభుత్వం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. విచారణకు సాక్షిగా పిలుస్తున్నారా లేదంటే నిందితుడిగానా అన్న విషయాన్ని ఈడీ చెప్పడం లేదని అన్నారు. లిక్కర్ స్కామ్ వ్యవహారం అంతా ఓ బూటకమని కొట్టిపారేశారు. అరెస్ట్ అయి జైలులో ఉన్న ఆప్ నేత మనీశ్ సిసోదియా భవిష్యత్‌లో నిర్దోషిగా బయటపడతారని అన్నారు.
'కేజ్రీవాల్ పరారీలో ఉన్నారు!'
ఈడీ విచారణకు గైర్హాజరు అవుతున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించడాన్ని బీజేపీ నేతలు తప్పుబట్టారు. తాను అవినీతికి పాల్పడ్డ విషయాన్ని ఎలా కప్పిపుచ్చుకోవాలో తెలియక కేజ్రీవాల్ ఆందోళన చెందుతున్నారని బీజేపీ నేత గౌరవ్ భాటియా ఎద్దేవా చేశారు. తప్పు చేయకపోతే ఈడీ విచారణ నుంచి తప్పించుకోవాల్సిన అవసరం ఏముందని బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా ప్రశ్నించారు.