Kejriwal ED Raid News :దిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికార నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడి చేయనుందన్న ఆప్ మంత్రుల ప్రకటనల మధ్య భద్రతను కట్టుదిట్టం చేయడం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. కేజ్రీవాల్ నివాసానికి దారితీసే రోడ్లన్నింటినీ బ్లాక్ చేయడం సహా అన్ని ద్వారాల వద్ద అదనపు బలగాలను మోహరించారని ఆప్ వర్గాలు తెలిపాయి. కనీసం ఆయన నివాసంలో పనిచేసే సిబ్బందిని కూడా లోపలికి అనుమతించటం లేదని, కేజ్రీవాల్ నివాసంలో దాడులు చేయటం సహా ఆయన్ను అరెస్ట్ చేసే ప్రయత్నాలను ఈడీ ముమ్మరం చేసినట్లు ఆప్ వర్గాలు ఆరోపించాయి.
'ఈడీ సమన్లు చట్టవిరుద్ధం- అరెస్ట్‌కు బీజేపీ కుట్ర!'
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేసేందుకు తనను బీజేపీ అరెస్ట్ చేయించాలని చూస్తోందని దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. దిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన తన ప్రతిష్ఠను దెబ్బతీయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. ఈడీ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఆ విషయం ఈడీకి కూడా తెలుసని వ్యాఖ్యానించారు. చట్టబద్ధంగా సమన్లు పంపిస్తే ఈడీకి సమాధానం చెప్పేందుకు తాను సిద్ధమేనని అన్నారు.
ఆప్ నేత ట్వీట్- దిల్లీ పోలీసుల వివరణ
గురువారం దిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఈడీ దాడులు చేస్తారని కేబినెట్ మంత్రి, ఆప్ నాయకురాలు అతిషి ఆరోపించారు. ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు.
అయితే ఆప్ ఆరోపణలను దిల్లీ పోలీసులు తోసిపుచ్చారు. ఆప్ మంత్రులు ప్రకటన నేపథ్యంలో మీడియా ప్రతినిధుల రాక పెరిగిందని, వారిని నియంత్రించేందుకే భద్రతను పెంచినట్లు దిల్లీ పోలీసులు వివరణ ఇచ్చారు.
గుజరాత్ పర్యటనకు కేజ్రీ
ఈ పరిణామాల మధ్య కేజ్రీవాల్ గుజరాత్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధత కోసం శనివారం ఆయన గుజరాత్‌కు వెళ్తారని ఆప్ వర్గాలు తెలిపాయి. మూడు రోజుల పాటు గుజరాత్లో ఆయన పర్యటిస్తారని తెలిపాయి. బహిరంగ సభల్లో పాల్గొనడం సహా పార్టీ వర్గాలతో సమావేశమవుతారని వివరించాయి. జైలుకు వెళ్లిన ఆప్ నేత చైతర్ వాసవను సైతం కలుస్తారని తెలిపాయి.