తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బీజేపీ చెప్తేనే ఈడీ నోటీసులు పంపిందన్న కేజ్రీవాల్​, లిక్కర్​ స్కామ్​ విచారణకు డుమ్మా! - అరవింద్ కేజ్రీవాల్​ ఈడీ లేఖ

Kejriwal ED Case : మద్యం కుంభకోణం కేసులో బీజేపీ ఆదేశాల మేరకే ఈడీ తనకు నోటీసులు పంపిందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఈడీ పంపిన నోటీసులు చట్ట విరుద్ధమని అన్నారు. కాగా, కేజ్రీవాల్ ఈరోజు ఈడీ ఎదుట హాజరుకాలేరని ఆప్ వర్గాలు తెలిపాయి.

Kejriwal ED Case
Kejriwal ED Case

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2023, 10:28 AM IST

Updated : Nov 2, 2023, 12:11 PM IST

Kejriwal ED Case : దిల్లీ మద్యం కేసులో ఎన్​ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్-ఈడీ పంపిన నోటీసులు చట్ట విరుద్ధమనీ.. రాజకీయ ప్రేరేపితమైనవని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ ఆదేశాల మేరకే తనకు ఈడీ నోటీసు పంపిందని ఆరోపించారు. త్వరలో నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల ప్రచారానికి తనను వెళ్లకుండా అడ్డుకునేందుకే నోటీసు వచ్చిందని పేర్కొన్నారు. ఈడీ వెంటనే నోటీసును ఉపసంహరించుకోవాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. మరోవైపు, ఈడీ విచారణకు కేజ్రీవాల్​ గైర్హాజరవుతారని ఆప్​ వర్గాలు వెల్లడించాయి. మధ్యప్రదేశ్​లో జరగనున్న ఎన్నికల రోడ్​షోలో పంజాబ్​ సీఎం భగవంత్​ మాన్​తో కలిసి ఆయన పాల్గొంటారని తెలిపాయి. మరోవైపు, ఈడీ మళ్లీ కేజ్రీవాల్​కు సమన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి గురువారం (నవంబర్‌ 2న) కేజ్రీవాల్​ ఈడీ కార్యాలయంలో హాజరుకావాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయనకు సమన్లు జారీచేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈడీ కార్యాలయం సమీపంలో ఆప్‌ కార్యకర్తలు గుమిగూడకుండా భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. తుగ్లక్‌ రోడ్డులోని ఈడీ కార్యాలయం వద్ద పోలీసు యంత్రాంగం పలు వరుసల్లో బారీకేడ్లను ఏర్పాటు చేసింది. భారీ సంఖ్యలో పోలీసులు, పారా మిలిటరీ బలగాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. డీడీయూ మార్గ్‌లోని బీజేపీ కార్యాలయానికి వద్ద, ఐటీఓ ప్రాంతంలోని ఆప్‌ కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో ఇండియా గేట్‌, వికాస్ మార్గ్‌, ఐటీఓ ప్రాంతంలో కొద్దిమేర ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. కేజ్రీవాల్‌.. రాజ్‌ఘాట్ వద్ద నివాళి అర్పించేందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలియడం వల్ల అక్కడ కూడా పోలీసులు భద్రతను పెంచారు.

మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా గురువారం ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరు కావాలంటూ కేజ్రీవాల్​కు ఈడీ అధికారులు సోమవారం సమన్లు జారీ చేశారు. ఈ కేసులో కేజ్రీవాల్​కు ఈడీ సమన్లు ఇవ్వడం ఇదే తొలిసారి. అంతకుముందు ఈ ఏడాది ఏప్రిల్​లో సీబీఐ.. ఆయనను మద్యం కుంభకోణం కేసులో కొన్ని గంటల పాటు ప్రశ్నించింది.

'మద్యం స్కామ్​లో ప్రధాన సూత్రధారి కేజ్రీనే!'
కేజ్రీవాల్​కు ఈడీ సమన్లు జారీచేయడంపై బీజేపీ నేత హరీశ్​ ఖురానా స్పందించారు. "చట్టం తన పని తాను చేసుకుపోతోంది. చట్ట ప్రకారమే కేజ్రీవాల్​కు ఈడీ సమన్లు జారీ చేసింది. మనీశ్​ సిసోదియా బెయిల్​ విచారణ జరిగిన సమయంలో రూ.338 కోట్ల నగదు బదిలీ జరిగినట్లు ఈడీ ఆధారాలు చూపిందని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు కేజ్రీవాల్​ అందుకు సమాధానం చెప్పాలి. 5 శాతం నుంచి 12 శాతానికి ఎక్సైజ్​ సుంకాన్ని ఎందుకు పెంచారో చెప్పాలి. స్కామ్​ లేకపోతే సిసోదియా బెయిల్ పిటిషన్​​ ఆరుసార్లు ఎందుకు తిరస్కరణకు గురవుతుంది? స్కామ్​ ప్రధాన సూత్రధారి అరవింద్​ కేజ్రీవాల్​" అని హరీశ్​ ఖురానా ఆరోపించారు.

రాజ్​ఘాట్​ వద్ద బీజేపీ నేతల నిరసన
దిల్లీలోని రాజ్​ఘాట్​ వద్ద బీజేపీ నాయకులు.. సీఎం అరవింద్​ కేజ్రీవాల్​కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. "ఈరోజు కాకపోతే.. రేపైనా ఈడీ ముందు కేజ్రీవాల్​ నిజం చెప్పవలసి ఉంటుంది. సత్యం ఎప్పుడూ గెలుస్తుంది. ఒకసారి నిజం మాట్లాడాలని నేను వ్యక్తిగతంగా ఆయనను అభ్యర్థిస్తున్నాను" అని బీజేపీ నాయకుడు హర్షవర్ధన్ అన్నారు.

దిల్లీ మంత్రి రాజ్‌కుమార్‌ నివాసంలో ఈడీ సోదాలు
దిల్లీ కేబినెట్​లోని మరో మంత్రి, ఆప్​ నేత రాజ్​కుమార్​ ఆనంద్​ ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. మనీ లాండరింగ్‌ కేసుతో సంబంధముందన్న అనుమానంతో ఈడీ ప్రస్తుతం ఆయన ఇంట్లో తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. దీంతో గురువారం తెల్లవారుజామునే అధికారులు మంత్రి ఇంటికి చేరుకుని సోదాలు మొదలుపెట్టారు. రాజ్‌కుమార్‌ ఆనంద్‌ దిల్లీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. తమ నేతలపై ఈడీ దాడులను ఆప్‌ తీవ్రంగా ఖండించింది. దర్యాప్తు సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ఈ దాడులు నిర్వహిస్తోందని ఆరోపించింది.

రాజ్​ కుమార్​ ఆనంద్​ ఇంట్లో ఈడీ సోదాలపై మరో మంత్రి సౌరభ్​ భరద్వాజ్​ స్పందించారు. "ఆప్​ ఎమ్మెల్యే అవ్వడమే రాజ్​ కుమార్​ ఆనంద్​ తప్పులా ఉంది. బ్రిటిష్​ కాలంలో ఒకరి ఇంటిని సోదా చేయాలంటే.. కోర్టు నుంచి సెర్చ్​ వారెంట్​ పొందాకే తనిఖీలు చేపట్టాలి. కానీ ఈరోజు అలా లేదు. ఈడీ ఎవరి ఇంటిపై దాడులు నిర్వహించాలో అధికారులే నిర్ణయిస్తారు. కేవలం ప్రతిపక్ష నేతల ఇళ్లపైనే దాడులు నిర్వహిస్తున్నారు" అని ఆయన ఆరోపించారు.

PM Degree Case : దిల్లీ సీఎం కేజ్రీవాల్​కు షాక్​.. ప్రధాని డిగ్రీ కేసులో సుప్రీం కీలక నిర్ణయం

Delhi CM House Renovation : కేజ్రీవాల్​కు CBI చిక్కులు.. ఇంటి రిపేరుకు రూ.44కోట్లు ఖర్చుపై కేసు!

Last Updated : Nov 2, 2023, 12:11 PM IST

ABOUT THE AUTHOR

...view details