'ఎల్జీ గారూ తిట్టినట్టు నా భార్య కూడా రోజూ తిట్టదు. గడిచిన ఆరు నెల్లలో ఎల్జీ రాసినన్ని ప్రేమలేఖలు నా భార్య కూడా రాసి ఉండదు' అంటూ దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు చురకలు అంటించారు ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. లెఫ్టినెంట్ గవర్నర్‌తో అభిప్రాయభేదాల నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ మేరకు ట్వీట్ చేశారు. ఇటీవల తనకు లెఫ్టినెంట్ గవర్నర్ వరుసగా లేఖలు రాయడంపై ఇలా భిన్నంగా స్పందించారు. 'ఎల్జీ గారు కాస్త శాంతించండి. మీ సూపర్ బాస్‌ను కూడా కాస్త ప్రశాంతంగా ఉండమని చెప్పండి' అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చారు కేజ్రీవాల్.
'నా భార్య కూడా మీలా తిట్టదు.. ఇలా లవ్ లెటర్స్ పంపదు'.. గవర్నర్‌కు సీఎం కౌంటర్
దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ వినూత్నంగా కౌంటర్ ఇచ్చారు. ఇటీవల తనకు ఎల్జీ వరుసగా లేఖలు రాయడాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు.
మహాత్మా గాంధీ, లాల్ బహదుర్ శాస్త్రి జయంతి సందర్భంగా రాజ్‌ఘాట్, విజయ్ ఘాట్‌లో నిర్వహించిన కార్యక్రమాలకు హాజరుకాకపోవడంపై ఆరాతీస్తూ ఇటీవల ఎల్జీ వికే సక్సేనా.. దిల్లీ ప్రభుత్వానికి లేఖ రాశారు. దిల్లీ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించిందని లేఖలో మండిపడ్డారు. 'గాంధీ, శాస్త్రిలకు నివాళులు అర్పించే కార్యక్రమానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్ సహా ఎంతో మంది అతిథులు వచ్చారు. మీరు గానీ, మీ మంత్రులు గానీ రాజ్‌ఘాట్, విజయ్‌ఘాట్‌కు రాలేదు. ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా కొద్దినిమిషాలు ఉన్నప్పటికీ.. ఆయన ఈ కార్యక్రమాల్లో తగిన రీతిలో భాగం కాలేకపోయారు. దిల్లీ యంత్రాంగం నుంచి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత కూడా మీరు భాగం కాకపోవడం ఆమోదయోగ్యంగా కాదు' అంటూ వీకే సక్సేనా తన లేఖలో పేర్కొన్నారు.