తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చైనాతో సరిహద్దులో వివాదం.. వాణిజ్యంలో మాత్రం జోష్.. దిగుమతులు నిషేధించలేమా? - kejriwal comments over india trade with china

గల్వాన్‌లో ఘర్షణలు, అరుణాచల్‌ ప్రదేశ్‌లో దుందుడుకు చర్యలతో చైనా మన సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంది. అయినా డ్రాగన్‌ నుంచి భారత్‌ దిగుమతులు తగ్గడం లేదు. గల్వాన్‌ ఘర్షణ అనంతరం కూడా చైనా దిగుమతులు పెరగడంపై కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పదునైన విమర్శలు సంధిస్తున్నాయి. చైనా ఆర్మీ సరిహద్దుల్లో మన సైనికులపై దాడులకు దిగుతుంటే శిక్షించాల్సిన మోదీ ప్రభుతం దిగుమతుల రూపంలో బహుమతులు ఇస్తోందని ఎద్దేవా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. చైనా దిగుమతులను నిషేధిస్తే భారత్‌పై పెను ప్రభావం తప్పదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

india trade with china 2022
2022లో చైనాతో భారతదేశ వాణిజ్యం

By

Published : Dec 18, 2022, 8:56 PM IST

సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా చైనా-భారత్ మధ్య వాణిజ్యం తగ్గలేదు సరికదా మరింతగా పెరిగింది. 2021-22లో చైనాతో వాణిజ్యం 115 బిలియన్‌ డాలర్లకు పెరగగా.. దిగుమతులు 94 డాలర్లకు పెరిగాయని కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది. 2014-15లో 60.41 బిలియన్ డాలర్లు ఉన్న చైనా దిగుమతులు.. 2021-22 నాటికి 94.57 బిలియన్ డాలర్లకు పెరిగాయని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం.. ఏప్రిల్-అక్టోబర్ మధ్య కాలంలో దిగుమతులు 60.27 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఎగుమతులు కేవలం 8.77 బిలియన్ డాలర్లుగా ఉందని కేంద్రం వెల్లడించింది.

2014-15లో చైనాకు భారత ఎగుమతులు 11.93 బిలియన్ డాలర్లు ఉండగా.. 2021-22 నాటికి 21.26 బిలియన్ డాలర్లకు పెరిగిందని వివరించింది. అంటే గత ఆరేళ్లలో.. చైనా-భారత్‌ మధ్య వాణిజ్యం భారీగా పెరిగింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తర్వాత కూడా చైనా నుంచి దిగుమతులు ఏ మాత్రం తగ్గకపోవడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

చైనా నుంచి భారత్‌ దిగుమతి చేసుకున్న వస్తువుల్లో ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, కెమికల్స్‌, ఔషధాలు, ఔషధ ఉత్పత్తులు, ఎరువులు, అద్దకాలు.. ఎక్కువ భాగం ఆక్రమిస్తున్నాయి. భారత ఫార్మా రంగానికి అవసరమైన ముడి పదార్థాలు చాలావరకు చైనా నుంచే భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. ఎలక్ట్రానిక్స్, టెలికాం, విద్యుత్‌ వంటి.. వేగంగా విస్తరిస్తున్న రంగాల డిమాండ్‌ను తీర్చడానికి చైనా నుంచి వస్తువులు దిగుమతి చేసుకోవడం తప్పనిసరని కేంద్రం అంటోంది. భారత డిమాండ్‌కు అనుగుణంగా దేశీయంగా వస్తువులు లేకపోవడం కూడా దిగుమతుల పెరుగుదలకు కారణమవుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా ఉత్పత్తులను ఉన్నపళంగా నిషేధిస్తే భారత్‌పై పెను ప్రభావం ఉండే అవకాశం ఉందని కూడా విశ్లేషిస్తున్నారు.

విచ్చలవిడిగా ఎగుమతులు...
సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్న సమయంలోనూ.. చైనా చవకైన ఉత్పత్తులను విచ్చలవిడిగా భారత్‌కు ఎగుమతి చేసింది. మేకిన్‌ ఇండియా నినాదంతో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నా.. చైనా నుంచి దిగుమతులు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం.. చైనాను శిక్షించడానికి బదులుగా అధికంగా ఉత్పత్తులు దిగుమతులు చేసుకుంటూ బహుమతి ఇస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ విమర్శించారు. భారత సైన్యంసరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే... మోదీ సర్కార్‌ దిగుమతులకు అనుమతినిస్తూ అంతా బాగానే ఉందనే సంకేతాన్నిస్తోందని ఆరోపించారు.

చైనా దిగుమతులను నిషేధిస్తేనే భారత్‌ విలువ డ్రాగన్‌ ప్రభుత్వానికి అర్థమవుతుందని కేజ్రీవాల్‌ అన్నారు. చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని కేజ్రీవాల్ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చైనా ఉత్పత్తులు చౌకగా ఉన్నా మనకు అక్కర్లేదని రెట్టింపు ఖర్చయినా మేడిన్‌ ఇండియా ఉత్పత్తులు కొనేందుకు సిద్ధమవ్వాలని దిల్లీ సీఎం సూచించారు. చైనా నుంచి దిగుమతయ్యే 90 శాతం వస్తువులు భారత్‌లోనే ఉత్పత్తి చేయవచ్చని.. కానీ కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందని కేజ్రీవాల్‌ విమర్శించారు. అమెరికా-చైనా మధ్య కూడా ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ ఆ రెండు దేశాల మధ్య వాణిజ్యం గత ఏడాదితో పోలిస్తే 28.7 శాతం పెరిగింది.

ABOUT THE AUTHOR

...view details