Kavitha Response To ED Notices In Delhi Liquor Scam: దిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో గతంలో సీబీఐ తనను ఏడు గంటలు విచారించింది. తాజాగా ఈ నెల 9వతేదీన విచారణకు హాజరుకావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇదే విషయంపై కవిత వివరణ ఇచ్చారు. ఈడీ విచారణకు తాను సహకరిస్తానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని.. ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం ఉండడంతో విచారణకు హాజరయ్యే తేదీ మార్పు గురించి న్యాయ నిపుణులతో చర్చించి సలహా తీసుకుంటానని చెప్పారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు కవిత ఓ ప్రకటన విడుదల చేశారు.
రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నదే తమ డిమాండ్ అని కవిత పేర్కొన్నారు. అందుకే ఈ నెల 10న దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రతిపక్ష పార్టీలు, మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి ఒకరోజు నిరాహార దీక్ష చేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని అన్నారు. ఈక్రమంలో ఈ నెల 9న దిల్లీలో విచారణకు హాజరు కావాలని.. ఈడీ తనకు నోటీసులు జారీ చేసిందని తెలిపారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని.. కానీ ధర్నా, ముందస్తు అపాయింట్మెంట్లు రీత్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటానని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.
ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీని లొంగదీసుకోవడం కుదరదని ఈ విషయం బీజేపీ పార్టీకి తెలుసని కవిత అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పుడూ ఎండగడుతూనే ఉంటుందని వ్యాఖ్యానించారు. దేశ అభ్యున్నతి కోసం అవసరమైన ప్రతిసారి గొంతెత్తుతామని.. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదని తేల్చి చెప్పారు. ప్రజల హక్కుల గురించి నిరంతరం పోరాడతామని తెలిపారు.
BRS Ministers reaction on ED notice to Kavitha: ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం.. కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట లాంటిదని మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతోనే కవితపై ఈ ఆరోపణలు చేశారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌పై కుట్రలో భాగంగానే ఈ నోటీసులు కవితకు పంపించారని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం దుర్మార్గమైన చర్య అని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. మహిళా బిల్లు కోసం దిల్లీలో రేపటి నుంచి కవిత నిరాహార దీక్ష చేయనుతున్న నేపథ్యంలో ఈడీ నోటీసులిచ్చిందని మండిపడ్డారు. ఈ చర్యతో బీజేపీకి మహిళల పట్ల ఉన్న వైఖరి అర్థమవుతుందన్నారు.
బీఆర్ఎస్, బీజేపీలు వేర్వేరు కాదు: రాష్ట్రంలో బీజేపీను పెంచే ప్రయత్నం గత రెండు సంవత్సరాలుగా సీఎం కేసీఆర్ చేస్తున్నారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆక్షేపించారు. దిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పాత్రపై ఆయన స్పందించారు. గతంలో కూడా కవితను సీబీఐ విచారించింది. ఇప్పుడు ఈడీ నోటీసులు ఇచ్చిందని.. రేపు ఆమెను అరెస్ట్ చేసినా చేయవచ్చు అని జోస్యం చెప్పారు. కవితను అరెస్ట్ చేస్తే అందులో నుంచి కూడా రాజకీయ లబ్ధిని పొందేందుకు బీఆర్ఎస్, బీజేపీలు చూస్తాయని ఆక్షేపించారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి మొదట నుంచి అనుమానాలు ఉన్నాయని.. బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదని మరోసారి నిరూపించారని అన్నారు.