UP Kaushambi Clashes Today :ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆగ్రహంతో నిందితుల ఇళ్లు సహా దుకాణాలకు నిప్పంటించారు గ్రామస్థులు. ఈ ఘటన కౌశాంబి జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. స్థల వివాదం కారణంగానే వీరిని హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఇదీ జరిగింది
సందీపన్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెయినుద్దీన్పుర్ గౌస్ గ్రామానికి చెందిన హోరిలాల్, సుభాష్‌కు మధ్య కొన్ని రోజులుగా స్థల వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే ఇంట్లో నిద్రిస్తున్న హోరిలాల్ సహా అతడి కూతురు బ్రజ్కాలీ, అల్లుడు శివ్సరణ్ విగతజీవులుగా కనిపించారు. శుక్రవారం ఉదయం లేచి చూసేసరికి ముగ్గురిని ఎవరో పదునైన ఆయుధాలతో హత్య చేసినట్టుగా గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు.. ఆగ్రహంతో నిందితుల ఇళ్లు, దుకాణాలకు నిప్పుపెట్టారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. ఎస్పీ బ్రిజేశ్ శ్రీవాస్తవ నేతృత్వంలోనే భారీ ఎత్తున పోలీసు బలగాలు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చాయి. అయితే, మృతదేహాలకు అంత్యక్రియలు చేసేందుకు గ్రామస్థులు ఒప్పుకోలేదు. నిందితులను అరెస్ట్ చేసేవరకు అంత్యక్రియలు చేయబోమంటూ తేల్చిచెప్పారు.
"శుక్రవారం ఉదయం 6 గంటలకు ముగ్గురి హత్య విషయంపై సమాచారం అందింది. దీనికి స్థల వివాదమే కారణంగా తెలుస్తోంది. మృతదేహాలను పోస్ట్ మార్టమ్ పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాం. త్వరలోనే పరారీలో ఉన్న నలుగురు నిందితులను పట్టుకుంటాం. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది."