విద్యార్థుల కోసం విభిన్నంగా ఆలోచించారు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. పిల్లల్లో చదువుపై ఆసక్తిని పెంచేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్రముఖ టీవీ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' తరహాలో.. స్కూల్లో ' కౌన్ బనేగా ఇంటెలిజెంట్ చైల్డ్' పేరుతో ఓ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నారు. ఆయనే ఉత్తర్ ప్రదేశ్ మిర్జాపుర్కు చెందిన సత్యేంద్ర కుమార్ సింగ్.
ఈ కార్యక్రమంతో విద్యార్థుల్లో చదువుపై ఇష్టాన్ని పెంచుతున్నారు సత్యేంద్ర కుమార్. పిల్లల్లో లోకజ్ఞానం పెరిగే విధంగా కృషి చేస్తున్నారు. ప్రతి శనివారం భోజన విరామం సమయంలో ఈ ప్రత్యేక షోను నిర్వహిస్తారు సత్యేంద్ర. గెలిచిన వారికి బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను సైతం అందజేస్తారు.
"మా విద్యార్థులు ఏడో తరగతి చదువుతున్నారు. అనకూడదు కానీ, చెప్పాల్సి వస్తుంది. వీరు కాస్త నిమ్న వర్గాల నుంచి వచ్చినవారు. వీరు చదువు పట్ల అంతగా ఆసక్తి కనబరచరు. అయితే వీరికి చదువుపై ఇష్టాన్ని కలిగించేందుకు మేము చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే పాఠశాలలో చెప్పే పాఠాలతో పాటు.. కాస్త మనోవికాసాన్ని పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే పిల్లలు ఇష్టంగా చదువుతారు. ఇందుకోసమే నేను ప్రత్యేకంగా కేబీఐసీ (కౌన్ బనేగా ఇంటెలిజెంట్ చైల్డ్) గేమ్‌ను రూపొందించాను. దీనిని ప్రతి శనివారం భోజన విరామం అనంతరం నిర్వహిస్తాను. ఈ ఆట ఆడటానికి పిల్లలు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో పిల్లలు చాలా లాభపడుతున్నారు. కొందరి పిల్లల మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల చదువులో రాణించలేకపోయేవారు. ఇక ప్రస్తుతం దీనిని ఆడించడం ద్వారా వారి ఆలోచనా శక్తి పెరుగుతోంది. దీంతో చదువుల్లో కూడా మెరుగ్గా రాణిస్తున్నారు. ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం. మొత్తంగా పాఠశాల రిజల్ట్స్ కూడా ఆశాజనకంగా ఉన్నాయి."
--సత్యేంద్ర కుమార్ సింగ్, ఉపాధ్యాయుడు.