Kashmiri Pandits Kejriwal: కశ్మీర్లో వరుస హత్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. కశ్మీరీ పండిట్లు లక్ష్యంగా జరుగుతున్న దాడులను అరికట్టేందుకు కేంద్రం స్పష్టమైన ప్రణాళికతో రావాలని అన్నారు. ఉగ్రదాడులతో.. కశ్మీరీ పండిట్లు బలవంతంగా తమ ఇళ్లను, లోయను విడిచిపెట్టాల్సి వస్తోందని పేర్కొన్నారు. 1990ల నాటి పరిణామాలు పునరావృతమవుతున్నాయని అన్నారు. పండిట్లపై లక్షిత దాడులకు వ్యతిరేకంగా.. దిల్లీ జంతర్ మంతర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన 'జన్ ఆక్రోశ్ ర్యాలీ'లో ఈ వ్యాఖ్యలు చేశారు దిల్లీ సీఎం.
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రకార్యకలాపాలు పెరగడానికి పాకిస్థాన్ కారణమని ఆరోపించారు కేజ్రీవాల్. కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని, దుశ్చర్యలను మానుకోవాలని పాక్‌కు హితవు పలికారు. భాజపా నీచమైన రాజకీయాలు చేస్తోందని, కశ్మీర్ సమస్యను ఎదుర్కోలేదని తీవ్రవిమర్శలు చేశారు.
''కశ్మీర్ సమస్యను తీర్చడం భాజపా తరం కాదు. వారికి నీచ రాజకీయాలు చేయడం మాత్రమే తెలుసు. దయచేసి కశ్మీర్‌పై రాజకీయాలు చేయొద్దు. కశ్మీర్లో ఏదైనా హత్య జరిగితే.. హోం మంత్రి అత్యవసర సమావేశం నిర్వహిస్తారు. మాకు మీటింగ్‌లు వద్దు. చర్యలు కావాలి. కశ్మీర్ కూడా అదే కోరుకుంటోంది. కశ్మీర్ సమస్య పరిష్కారానికి కేంద్రం ఎలాంటి ప్రణాళిక రూపొందించిందో కేంద్రం.. ప్రజలకు తెలియజేయాలి. కశ్మీరీ పండిట్ల డిమాండ్లను నెరవేర్చాలి. వారికి సరైన భద్రత కల్పించాలి.''
- అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి