తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భూతల స్వర్గంలో దేశీయ పర్యటకుల సందడి - భూతల స్వర్గం

కశ్మీర్ లోయ దేశీయ పర్యటకులను ఆకర్షిస్తోంది. కరోనాతో అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఉన్న వేళ.. దేశంలోని అందాలను తనివితీరా చూసేందుకు క్యూ కడుతున్నారు ప్రజలు. కరోనాతో కుదేలైన ఆతిథ్య, పర్యటక రంగాలు.. ఇకనైనా పుంజుకుంటాయని స్థానికులు ఆశిస్తున్నారు.

KASHMIR TOURISM
భూతల స్వర్గంలో దేశీయ పర్యటకుల సందడి

By

Published : Aug 8, 2021, 6:43 PM IST

కశ్మీర్ పర్యటకులు

కశ్మీర్ హిమగిరుల్లో ఆహ్లాదం ఉట్టిపడుతోంది. దాల్ సరస్సులో మళ్లీ సంప్రదాయ పడవలు చక్కర్లు కొడుతున్నాయి. కొవిడ్​తో రెక్కలు తెగిన పర్యటకం పుంజుకుంటోంది. మొత్తంగా అందాల కశ్మీర్ లోయ.. వీక్షకులతో మరింత కళకళలాడుతోంది.

భారత ప్రభుత్వం 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత కశ్మీర్​లో పరిస్థితులు మారిపోయాయి. సమాచార వ్యవస్థను నిలిపివేయడం, ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేయడం వల్ల పర్యాటకానికి ఆస్కారం లేకుండా పోయింది. అనంతరం కొవిడ్ పంజా విసరడం.. ఇక్కడి ప్రకృతి అందాలు బోసిపోయేలా చేసింది. ప్రస్తుతం అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఉండటం వల్ల.. దేశంలోని ప్రజలే కశ్మీర్​కు పయనమవుతున్నారు. విదేశీ ప్రయాణాలను పక్కనబెట్టి.. తమ టూర్ డెస్టినేషన్​గా కశ్మీర్ లోయను ఎంచుకుంటున్నారు.

దాల్ సరస్సులో కూరగాయలు అమ్ముతున్న కశ్మీరీలు. పడవల్లోనే కూరగాయలు, ఇతర వస్తువులు తీసుకొచ్చి విక్రయించడం.. ఇక్కడి ప్రత్యేకత.
కస్టమర్ల కోసం ఎదురుచూస్తున్న పూల వ్యాపారి.

కరోనా వల్ల ఇంట్లోనే కాలం గడిపినవారందరికీ.. ఇదో కాలక్షేపంగా ఉంటోందని హైదరాబాద్​కు చెందిన సంహిత అయ్యంగారి చెప్పుకొచ్చారు.

"ఏడాదిన్నరగా నేను ఇంట్లోనే ఉంటున్నాను. కేవలం ఇంట్లోనే. ఎక్కడికీ ప్రయాణించలేకపోయాను. ఏ ప్రాంతానికీ వెళ్లలేకపోయాను కాబట్టి.. ఈ ట్రిప్ కచ్చితంగా ఓ కాలక్షేపం లాంటిది."

-సంహిత అయ్యంగారి, టూరిస్ట్, హైదరాబాద్

"ఇది మా తొలి ట్రిప్. మా హనీమూన్ ఇది. కరోనా రెండో దశ వల్ల మా వివాహం వాయిదా పడింది. ఈ నెలలోనే పెళ్లి చేసుకున్నాం. ఇది మాకు ఆహ్లాదకరమైన సమయం. కరోనా వల్ల కొంచెం ఆందోళనకు గురైన మాకు.. ఈ వెకేషన్ ఉల్లాసాన్ని ఇస్తుంది."

-నిహారికా రిషభ్, పర్యాటకురాలు

వీక్షకుల సంఖ్య పెరగడం పట్ల స్థానికంగా పడవ నడుపుకునే ఇమ్రాన్ అలీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, మరోసారి మహమ్మారి విజృంభిస్తే.. తన ఆదాయానికి గండి పడుతుందని ఆందోళన చెందుతున్నారు.

"గత రెండేళ్ల నుంచి మేం ఇక్కట్లు ఎదుర్కొంటున్నాం. పర్యటకంపైనే మా జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఇతర వ్యాపారాలేవీ మాకు లేవు. రెండో దశతో పాటు, మూడో దశ వార్తలు మా ఇబ్బందులను పెంచాయి. ప్రస్తుతానికైతే పర్యటకులు పెరుగుతారని ఆశిస్తున్నాం. కరోనా కేసుల పెరుగుదల.. మళ్లీ మాపై ప్రభావం చూపొద్దని అనుకుంటున్నాం."

-ఇమ్రాన్ అలీ, పడవ నడిపే వ్యక్తి

ప్రస్తుతానికైతే కశ్మీర్ లోయ టూరిస్టులతో కళకళలాడుతోంది. శ్రీనగర్​తో పాటు చుట్టుపక్కల మంచుతో కూడుకున్న ప్రాంతాలకూ పర్యాటకులు వెళ్తున్నారు. స్థానిక టూరిస్ట్ ట్రేడర్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం.. 500 మంది విదేశీయులతో కలిపి 2021లో లక్షా 51 వేల మందికి పైగా పర్యటకులు శ్రీనగర్​ను సందర్శించారు. ఒక్క జులై నెలలోనే 48,863 మంది పర్యటకులు కశ్మీర్ అందాలను కనులారా వీక్షించారు.

విక్రయాలకు బ్రేక్ ఇచ్చి.. చిరు వ్యాపారులంతా ఒక్కచోటికి చేరి ముచ్చటిస్తున్న చిత్రం
పశువుల కోసం తామర ఆకులు, గడ్డిని కోసుకెళ్తున్న స్థానిక మహిళ

ఇప్పట్లే కష్టమే!

పర్యటకుల తాకిడి పెరిగినప్పటికీ.. కశ్మీర్​లో పర్యటక రంగం మునుపటి స్థాయిని అందుకోవడం ఇప్పట్లో కష్టమేనని దాల్ సరస్సులో నడిచే విలాసవంతమైన హౌస్​బోట్ యజమాని యసీన్ టూమన్ చెబుతున్నారు.

"ఆతిథ్య రంగం 30 శాతానికి మించి ఆక్యుపెన్సీని నమోదు చేయడం లేదు. కేవలం విలాసవంతమైన వ్యాపారాలు నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రయాణాలు చేయడానికి వెనుకాడని వ్యక్తుల వల్ల ఆ వ్యాపారం కొనసాగుతోంది. మధ్య తరగతి వర్గానికి ఉద్యోగాలు లేవు. దేశవ్యాప్తంగా ప్రయాణించేందుకు డబ్బులు లేవు."

-యసీన్ టూమన్, హౌస్​బోట్ యజమాని

మరోవైపు, కశ్మీర్​లోని హోటళ్లు, రెస్టారెంట్లు కరోనా నిబంధనలు పాటిస్తున్నాయి. గదులను తరచుగా శానిటైజ్ చేస్తున్నాయి. కరోనా టీకా తీసుకున్న వ్యక్తులను సిబ్బందిగా నియమించుకున్నాయి. అతిథుల నుంచి కొవిడ్ నెగెటివ్ పత్రాలను తప్పనిసరి చేస్తున్నాయి.

నీటిలో తేలియాడే కూరగాయల మార్కెట్
దాల్ సరస్సులో సంప్రదాయ గ్రీన్ టీ ఆకుల(కెహ్వా)ను విక్రయిస్తున్న వ్యక్తి
తన కొడుకును పడవలో స్కూల్​కు పంపిస్తున్న కశ్మీరీ వ్యక్తి

కరోనా సావాసం..

అదేసమయంలో జమ్ము కశ్మీర్​లో కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా ఉంది. పర్యటకుల తాకిడి అధికంగా ఉండే హిమాచల్ ప్రదేశ్​ వంటి రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే, స్థానిక ప్రజలకు కొవిడ్​పై అవగాహన పెంచుతున్నామని వైద్య సిబ్బంది చెబుతున్నారు. లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details