ఎడ్యూకేషనల్ బోర్డు నిర్లక్ష్యానికి అద్దం పట్టేలా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు ఇచ్చే ప్రశ్నాపత్రాలలో కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా పేర్కొనడం వివాదానికి దారితీసింది. దీనిపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే..
బిహార్ కృష్ణగంజ్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న అర్ధవార్షిక పరిక్షల్లో ఏడవ తరగతి విద్యార్థులకు ఓ విస్తుపోయే ప్రశ్న ఎదురైంది. 'చైనా, నేపాల్, ఇంగ్లండ్, కశ్మీర్, భారత్‌లోని ప్రజలను ఏమని పిలుస్తారు?' అంటూ ప్రశ్న అడిగారు. అన్నీ దేశాల పేర్లు ఉండగా.. కశ్మీర్‌ను సైతం అందులో భాగం చేయడం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన ప్రశ్నాపత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కశ్మీర్ భారత్‌లో భాగం కాదని అదొక ప్రత్యేక దేశమనేలా అర్థం వస్తోందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సర్వశిక్షా అభియాన్ కింద జిల్లాలోని మాధ్యమిక పాఠశాలల్లో పరీక్ష నిర్వహించగా.. రాష్ట్రంలోని బిహార్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కౌన్సిల్ వాటిని పర్యవేక్షిస్తుంది. ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదని పాఠశాల యాజమాన్యాలు చెబుతున్నాయి. 2017లోనూ బోర్డు ఇదేతరహా ప్రశ్నను అడిగిందని మండిపడుతున్నాయి. ఇది పూర్తిగా మానవ తప్పిదమని బోర్డు వివరణ ఇచ్చింది.