జమ్ముకశ్మీర్ లోయలో ఈసారి భద్రతా బలగాలకు మిశ్రమ ఫలితాలు అందాయి. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ ఉగ్రవాదులను దేశంలోకి చొరబడకుండా అడ్డుకోవడంలో భారత సైన్యం ఎన్నో విజయాలను నమోదు చేసింది. కానీ, స్థానిక కశ్మీరీలే.. అధికంగా ఉగ్రవాదానికి ఆకర్షితులవడం ఆందోళన కలిగిస్తోంది. 2020లో భద్రతా బలగాల చేతిలో 226 మంది ముష్కరులు హతమయ్యారు. అయితే.. వీరిలో 176 మంది(78శాతం) స్థానికులే ఉండడం గమనార్హం. మిగతా 50 మంది విదేశీ ఉగ్రవాదులు. స్థానికుల్లో పెరుగుతున్న అసంతృప్తే.. వారిని ముష్కరులతో జత కట్టేలా చేస్తోందని తెలుస్తోంది.
ఉగ్రవాదంలో ఏ ఏడాది ఎంతమంది స్థానికులు కలిశారు?
ఏడాది | సంఖ్య |
2015 | 66 |
2016 | 88 |
2017 | 128 |
2018 | 191 |
2019 | 119 |
కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టే దిశగా భారత సైన్యం గట్టి చర్యలు చేపట్టింది. పోలీసులతో, పారా బలగాలతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి కచ్చితమైన ప్రణాళికలు రచిస్తోంది. వీటితో పాటు డ్రోన్ల వంటి అధునాతన సాంకేతిక పర్యవేక్షణ, మానవ మేథస్సుతో ఉగ్రవాదానికి దీటైన సమాధానమిస్తోంది.
స్థానికులు ఎందుకు ఆకర్షితులవుతున్నారు?
2019, ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్లో స్థానిక రాజకీయ పార్టీల జోక్యం బాగా తగ్గిపోయింది. ఇది స్థానిక యవతలో అసంతృప్తికి దారితీసింది. ఇలాంటి వారిలో ముష్కర సంస్థలు ఉగ్రవాద బీజాలు నాటుతున్నాయి. భద్రతా బలగాల చేతిలో ఈ ఉగ్రవాదులు హతమైనప్పుడు కశ్మీర్లోని స్థానికులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యేలా చేస్తోంది. ఫలితంగా.. మరింత ఎక్కువ మంది ముష్కరులతో చేతులు కలుపుతున్నారు.
ఎందుకు ఎక్కువ మంది చనిపోతున్నారు?
గత ఐదేళ్లుగా ఉగ్రవాదుల్లో చేరే స్థానికల సంఖ్య ఎంతలా పెరుగుతోందో.. అదే స్థాయిలో భద్రతా బలగాల చేతిలో మరణించే ముష్కరుల సంఖ్య నమోదవుతోందని సైనిక గణాంకాలు చెబుతున్నాయి. 2020లో దాదాపు 226 మంది ఉగ్రవాదులు హతమవగా.. వీరిలో చాలా మంది స్థానికులే ఉన్నారు. ముష్కర కూటముల్లో చేరిన వీరికి సరైన శిక్షణ ఇవ్వకుండా, భావోద్వేగాలను రెచ్చగొడుతూ భద్రతా బలగాల మీదకు ఉగ్రవాద సంస్థలు ఉసిగొల్పుతున్నాయి. ఫలితంగా.. చనిపోయే వారి సంఖ్యా ఎక్కువవుతోంది. దానితో పాటు సైనిక బలగాలు తీసుకుంటున్న పటిష్ఠ చర్యలు ఇందుకు కారణమవుతున్నాయి.