ప్రకృతి సోయగాలకు నిలయమైన జమ్ముకశ్మీర్‌లోని హిమానీనదాలు (Kashmir Glaciers Melting) అత్యంత వేగంగా కరిగిపోతున్నాయి.లక్షలాది మంది కశ్మీరీల జీవనోపాధిపై తీవ్రప్రభావం చూపుతున్నాయి. కశ్మీర్ లోయలోని సోన్‌మార్గ్ సమీపంలో తాజివాస్ హిమానీనదం (Thajiwas Glacier kashmir) ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తుంది. చుట్టూ మంచుకొండలు, పచ్చిక బయళ్లు, జలపాతాలతో ఎంతో ప్రసిద్ధి చెందింది. కానీ ప్రస్తుతం ఆ ప్రాంతంలో హిమానీనదం అత్యంత వేగంగా కరిగిపోతోంది. గడిచిన మూడేళ్లలోనే ఈ భారీ హిమానీనదం దాదాపు 50 మీటర్లకు పైగా కరిగిపోయిందని కశ్మీర్ విశ్వవిద్యాలయంలో సీనియర్ ప్రొఫెసర్ ఇర్ఫాన్ రషీద్ తెలిపారు. వాతావరణ పరిస్థితుల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న మార్పులతోనే హిమానీనదాలు కరిగిపోతున్నాయని ఆయన అన్నారు.
జమ్ముకశ్మీర్ ప్రాంతంలో 1980వ దశకం నుంచి దాదాపు ఆరు హిమానీనదాలు పూర్తిగా అదృశ్యమైనట్లు (Kashmir Glaciers Melting) ప్రొఫెసర్ ఇర్ఫాన్ రషీద్ చెప్పారు. ముఖ్యంగా 2000 సంవత్సరం తరువాతే నాలుగు హిమానీదాలు పూర్తిగా కరిగిపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.దీని కారణంగా నీటి లభ్యత రోజురోజుకు తగ్గుముఖం పడుతోందని అన్నారు. ఇది స్థానికంగా నివసించే లక్షలాది ప్రజల జీవనోపాధిపై ప్రభావం చూపుతుందని వివరించారు. జమ్ముకశ్మీర్ ఆర్థిక వ్యవస్థలో కీలక రంగాలైన పర్యాటకం, వ్యవసాయంపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడుతుందన్నారు. అనేక మంది స్థానిక రైతులు వరి సాగుకు స్వస్తి పలికి.. యాపిల్ సాగువైపు మోగ్గుచూపుతున్నారని చెప్పారు.
జమ్ముకశ్మీర్ ప్రాంతంలో దాదాపు 14,000 హిమానీనదాలు ఉన్నాయి. 1980 నుంచి దాదాపు ఆరు హిమానీనదాలు అదృశ్యమయ్యాయి. వాటిలో నాలుగు హిమానీనదాలు 2000 తర్వాత కనిపించకుండాపోయాయి. మారుతున్న వాతావరణం కారణంగా అవి అదృశ్యమవుతున్నాయి.
- ప్రొఫెసర్ ఇర్ఫాన్ రషీద్, కశ్మీర్ విశ్వవిద్యాలయం
హిమానీనదాలు వేగంగా కరుగుతుండడంతో (Kashmir Glaciers Melting) కశ్మీర్ ప్రాంతంలో నివసించేవారు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పది సంవత్సరాల క్రితం హిమానీనదాలు ధవళ వర్ణంలో కాంతులీనుతూ ఉండడం తాను చూశానని ఎన్నో ఏళ్లుగా హిమాలయాలను నిశితంగా గమనిస్తున్న స్థానిక పశువుల కాపరి మహ్మద్ ఆయూబ్ తెలిపారు. గతంలో తాజివాస్ హిమానీనదం నుంచి ప్రారంభమైన ప్రవాహం కశ్మీర్ లోయ చివరి వరకు భారీ స్థాయిలో ప్రవహించేదని చెప్పారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఎన్నో హిమానీనదాలు తన కళ్ల ముందే కనుమరుగయ్యాయని ఆయూబ్ ఆవేదన వ్యక్తం చేశారు.