చాలా మందికి పిజ్జా చూడగానే నోరూరుతుంది. వెంటనే ఒక్క బైట్ అయినా తినేయాలనిపిస్తుంది. మరి అలాంటి పిజ్జాను ఉచితంగా ఇస్తున్నారంటే?. అది కూడా పూర్తిగా తిన్నవారికి నగదు ఇస్తున్నామని చెబితే?.. పిజ్జా ప్రియులు క్యూలో నిల్చుంటారనడంలో సందేహం అక్కర్లేదు. ఇలాంటి వినూత్న ఆలోచనతోనే కస్టమర్లను ఆకర్షించేందుకు ఓ ఛాలెంజ్‌తో ముందుకొచ్చాడు శ్రీనగర్‌కు చెందిన ఓ పిజ్జా షాపు ఓనర్.
అరగంటలో తాము ఇచ్చే పిజ్జా తింటే రూ. 20,000 బహుమతిగా ఇస్తామని ప్రకటించాడు. పిజ్జాకు డబ్బులు కూడా తీసుకోమని తెలిపాడు. అయితే.. ఇతర దేశాల్లో ఇలాంటి ఛాలెంజ్‌లు మనం తరచూ చూస్తున్నప్పటికీ కశ్మీర్లో ఇదే తొలిసారి అంటున్నాడు పిజ్జా షాపు ఓనర్ ఇస్రార్ అహ్మద్ మీర్.
"కశ్మీరీ ప్రజలు ఈ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నారు. ఇలాంటి ఫుడ్ ఛాలెంజ్‌లు ఉండాలని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటివరకు పిజ్జా ఛాలెంజ్‌లో ఆరుగురు పాల్గొన్నారు. ఎవరూ ఛాలెంజ్ నెగ్గలేదు. కానీ, దీన్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. ఓ వ్యక్తి మాత్రం 90శాతం పిజ్జా తినగలిగాడు."