యాపిల్ పండ్లు అనగానే ఎవరికైనా కశ్మీర్ గుర్తుకొస్తుందంటే అతిశయోక్తి కాదు. ఆ ఫలాలను పండిస్తున్న రైతులు ప్రస్తుతం నష్టాలను చవిచూస్తున్నారు. కశ్మీర్ లోయ నుంచి ఇతర ప్రాంతాల్లో ఉన్న మార్కెట్లకు పండ్ల రవాణా సక్రమంగా సాగకపోవడం ఇందుకు ప్రధాన కారణం. దీని వల్ల పండ్ల ధరలు నిరుటి కన్నా దాదాపు 30 శాతం పడిపోయాయని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
భారీగా పడిపోయిన కశ్మీర్ యాపిల్ ధరలు.. కారణం ఏంటంటే?
యాపిల్ పండ్లకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం కశ్మీర్. ప్రస్తుతం అక్కడ రవాణా సౌకర్యాలు దెబ్బతినడం వల్ల కశ్మీర్ యాపిల్ ధరలు భారీగా పడిపోయి.. రైతులకు నష్టాలను కలిస్తోంది. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
దేశంలో పండే యాపిల్ పండ్లలో 75 శాతం కశ్మీర్ నుంచే వస్తాయి. జమ్మూ-కశ్మీర్ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో 8.2 శాతం వాటా వీటి సాగు నుంచే వస్తోంది. లోయలో ఏడాదికి 21 లక్షల మెట్రిక్ టన్నుల పండ్లు ఉత్పత్తవుతున్నాయి. గత సెప్టెంబరులో కొండచరియలు విరిగిపడటం వల్ల శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిని తరచూ మూసివేశారు. సరకు రవాణా వాహనాలు రోజుల తరబడి నిలిచిపోయాయి. ఆసియాలోనే అతిపెద్ద టోకు మార్కెట్ అయిన దిల్లీలోని ఆజాద్‌పుర్ మండీ సహా కశ్మీర్ లోయ ఆవల ఉన్న మార్కెట్లకు సకాలంలో చేరవేయలేని పరిస్థితి ఏర్పడింది. మార్కెట్‌లకు చేరడం ఆలస్యం కావడం వాటి ధరలపై ప్రభావం చూపిందని పండ్ల ఉత్పత్తిదారు, వ్యాపారి బషీర్ అహ్మద్ బాబా తెలిపారు.
16 కిలోల యాపిళ్ల పెట్టె విలువ రూ.500కు పైగా ఉండగా.. తమకు సగటున రూ.400 మాత్రమే వస్తోందని వాపోయారు. నిరుటితో పోలిస్తే ప్యాకింగ్, రవాణా ఖర్చు దాదాపు రెండింతలైందని, ఉత్పత్తి ఎక్కువగా రావడం వల్ల ధరలు 30 శాతం పడిపోయాయని కశ్మీర్ యాపిల్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు, ఆజాద్‌పుర్ ఫ్రూట్ అండ్ వెజిటెబుల్ ట్రేడర్స్ ఛాంబర్ అధ్యక్షుడు మేఠారామ్ కృప్లానీ తెలిపారు.