Kashi Tamil Sangamam 2023 : ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ భావనను కాశీ తమిళ సంగమం మరింత బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నూతన పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించగానే ఈ భావన కనిపిస్తుందని చెప్పారు. అధికారిక మార్పిడికి గుర్తుగా భావించే సెంగోల్‌ను కొత్త పార్లమెంట్ భవనంలో ప్రతిష్ఠించామని గుర్తు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ఏర్పాటు చేసిన కాశీ తమిళ సంగమం 2.0 కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. తమిళనాడు, కాశీ ప్రజల మధ్య ఉన్న సంబంధం ప్రత్యేకమైనదని తెలిపారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఐఐటీ మద్రాస్ భాగస్వామ్యంగా ఏర్పడి ఈ కాశీ-తమిళ సంగమాన్ని విజయవంతం చేయడాన్ని ప్రశంసించారు.
కాశీ తమిళ సంగమం కార్యక్రమంలో తొలిసారిగా కృత్రిమ మేధతో భాషను తర్జుమా చేసే 'భాషిణి' విధానాన్ని ఉపయోగించారు. దీని ద్వారా ప్రధాని మోదీ హిందీలో చేసిన ప్రసంగాన్ని అక్కడి తమిళ శ్రోతలు తమ మాతృభాషలో విన్నారు. అంతకుముందు వారణాసి నుంచి కన్యాకుమారి వరకు నడిచే కాశీ తమిళ సంగమం ఎక్స్‌ప్రెస్ రైలును మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇతర నేతలు పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిసెంబర్ 17 నుంచి 30 మధ్య ఈ కార్యక్రమం జరగనుంది. బుధవారం జరిగిన కార్యక్రమానికి సుమారు 1,400 మంది అతిథులు హాజరయ్యారు.