Kasani Gnaneshwar Resigns from TTDP : తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి అధిష్ఠానం నిరాకరించిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కాసాని జ్ఞానేశ్వర్ ఆదివారం ఎన్టీఆర్ భవన్‌లో సమావేశమయ్యారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి అధిష్ఠానం నిరాకరించినట్టు శ్రేణులకు తెలిపారు. దీనిపై కొందరు నేతలు స్పందిస్తూ.. పోటీ చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఈ క్రమంలో కాసాని జ్ఞానేశ్వర్ భావోద్వేగానికి గురయ్యారు. ఇంతలోనే పార్టీ అధ్యక్ష పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేయడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి జైలులో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ శనివారం ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో తెలంగాణపై దృష్టి పెట్టలేమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏ పరిస్థితుల్లో పోటీకి దూరంగా ఉండాల్సి వస్తుందో నేతలకు వివరించాలని కాసానికి సూచించారు. చంద్రబాబు నిర్ణయాన్ని టీడీపీ సీనియర్ నేతలు.. తెలంగాణ నేతలకు వివరించారు.
ఇదే విషయంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో కాట్రగడ్డ ప్రసూన, జీవీజీ నాయుడు, సాయిబాబా సహా పలువురు నేతలు, జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఈసారి దూరంగా ఉండాలన్న అధిష్ఠానం నిర్ణయాన్ని వెల్లడించారు. ఊహించని ఈ పరిణామంతో కార్యకర్తల నుంచి నిరసన జ్వాలలు రేకెత్తాయి. అధిష్ఠానం నిర్ణయంతో కాసాని జ్ఞానేశ్వర్ సైతం కన్నీటి పర్యంతమయ్యారు.