Karwa Chauth 2023: మహిళలు తమ ఆరోప్రాణంగా భావించేవి పసుపూ కుంకుమలు. తమ తాళిబొట్టు నిండు నూరేళ్లు నిలవాలని.. భర్త ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ప్రతీ భార్యా కోరుకుంటుంది. అప్పుడే.. కుటుంబం చింతల్లేకుండా కళకళలాడుతుంది మరి. అందుకే.. భర్త శ్రేయస్సు కోసం మహిళలు ఎన్నో నోములు నోస్తారు. వ్రతాలు కూడా చేస్తారు. పూజలూ నిర్వహిస్తారు. ఈ కోవకు చెందినదే కర్వా చౌత్ ఉపవాసం. ప్రతీఏటా వైభవంగా ఈ వేడుక జరుపుకుంటారు.
ముఖ్యంగా.. ఉత్తర భారతంలో ఈ వేడుకను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. లక్షలాది మంది వివాహిత మహిళలు.. తమ జీవిత భాగస్వామి క్షేమాన్ని కోరుకుంటూ.. కర్వా చౌత్ ఉపవాసాన్ని పాటిస్తారు. ఈ వేడుక శుభముహూర్తం ప్రాంతానికో విధంగా ఉంది. దేశవ్యాప్తంగా నవంబర్ 1వ తేదీన కర్వా చౌత్ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ రోజున సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు ఉపవాసం పాటిస్తారు. అయితే.. ముహూర్తం విషయంలో స్వల్ప తేడాలు ఉన్నాయి.
కర్వా చౌత్ వేళ(Karwa Chauth 2023).. చేయాల్సినవి.. చేయకూడనివి..!
హిందూ సంప్రదాయం ప్రకారం.. కర్వా చౌత్ అనేది మహిళలకు, ముఖ్యంగా వివాహం చేసుకున్న వారికి అత్యంత కీలకమైన పండుగ.
ఈ ఉత్సవం నాడు మహిళలు త్వరగా మేల్కొని, తలంటు స్నానం చేయాలి.
కర్వా చౌత్ పూజా విధానం ప్రకారం.. శివపార్వతులను, గణేశుడిని పూజిస్తారు. ఆ తర్వాత వారు ఏదైనా తింటారు. ఇదంతా సూర్యోదయానికి ముందే జరిపోవాలి.
ఏదైనా కాయ, ఆకు కూర, పరోటా, కొబ్బరి నీళ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు. ఇలా తీసుకోవడన్ని "సర్గి" అంటారు.
సూర్యుడు ఉదయించడానికి ముందే తినడం ముగించాలి. మళ్లీ రాత్రి చంద్రుడిని చూసే వరకూ ఏమీ తినకూడదు. కనీసం నీళ్లు కూడా తాగకూడదు!
రాత్రి చంద్రుడు ఉదయించినప్పుడు.. మహిళలు జల్లెడలో నుంచి భర్త ముఖాన్ని చూసిన తర్వాతనే.. ఉపవాసం విరమించాలి.
కర్వా చౌత్ కోసం మహిళలు స్వచ్ఛమైన దుస్తులను ధరిస్తారు.
ఉపవాసం విరమించిన తర్వాత.. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. దీనివల్ల జీర్ణవ్యవస్థ మీద ప్రభావం పడకుండా ఉంటుంది.
ప్రాంతాల వారీగా కర్వా చౌత్‌ను విభిన్నంగా జరుపుకుంటారు.