Karthika Masam 2023 :అన్ని మాసాల్లోనూ కార్తికమాసానికి ఎంతటి ప్రత్యేకత ఉంటుందో మనకు తెలిసిందే. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాల ద్వారా.. విశేషమైన ఫలితం లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ మాసంలోని ప్రతిరోజునూ పుణ్యదినంగా పరిగణిస్తారు. అందుకే.. భక్తులంతా నిష్టతో పూజలు చేస్తారు. వేకువజామున చేసే పూజలతో ఆలయాలు కళకళలాడుతుంటాయి. అయితే.. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ మాసంలో ఏ దేవుళ్లను పూజించాలి? ఎవరిని ఆరాధిస్తే సరైన పుణ్యఫలం దక్కుతుంది? అనే సందేహాలు భక్తుల్లో ఉంటాయి. వీటికి సమాధానాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Karthika Masam Significance in Telugu :ప్రతి ఏడాదీదీపావళి తరువాతి రోజునుంచి ఈ కార్తికం మొదలవుతుంది. చంద్రుడు పౌర్ణమినాడు కృత్తికా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ నెలకు కార్తికమనే పేరు వచ్చింది. ఈ నెలలో చేసే జపం, ధ్యానం, నదీస్నానం, దానం, ఆరాధనతో సకల శుభాలూ కలుగుతాయి. శరదృతువు ఉత్తరార్ధంలో వచ్చే కార్తికమాసంలో ప్రతిరోజూ ఓ పర్వదినమే. కార్తిక సోమవారాలకు మరింత ప్రాధాన్యం ఉంటుంది. ఇన్ని కారణాలతోనే.. ఆస్తిక లోకంలో ఈ మాసానికి అంతటి ప్రత్యేకత ఉంటుంది.
భక్తులకు అలర్ట్ - కార్తిక మాసంలో శ్రీశైలం వెళ్తున్నారా? ఈ విషయం తెలియకపోతే ఇబ్బందే!
ఏ దేవుళ్లను పూజించాలి..?
"'శివాయ విష్ణురూపాయ.. విష్ణురూపాయ శివాయ.." అంటారు. ఎందుకంటే.. పరమశివునికి, విష్ణువుకు ఇద్దరికీ ఈ కార్తిక మాసం ఇష్టమే. అందుకే.. ఈ నెల రోజులూ వీరిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. స్వామివార్లను దర్శించి కార్తికదీపాలు వెలిగిస్తే.. సకల దోషాలు తొలగిపోతాయని అంటున్నారు. శివార్చనతోపాటు విష్ణు భగవానునికి ప్రీతికరమైన పూజ కార్యక్రమాలు చేయడం ద్వారా.. పూర్వ జన్మలోని దోషాలు తొలగిపోతాయట. భక్తిశ్రద్ధలతో జ్యోతిని వెలిగిస్తే.. అజ్ఞానం తొలగిపోయి.. జ్ఞానం సిద్ధిస్తుందని అర్చకులు చెబుతున్నారు.