బ్రిటిష్ పాలనకు చరమగీతం పలుకుతూ 1947లో మనకు స్వాతంత్య్రం సిద్ధించింది. దేశ ప్రజలంతా అప్పుడు సంబరాల్లో మునిగితేలారు. త్రివర్ణ పతాకాలను ఎగురవేసి తమ దేశభక్తిని చాటుకున్నారు. మరి 75 ఏళ్ల క్రితం ఆనాడు ఎగరేసిన జాతీయ పతాకాన్ని ఇప్పటికీ చూడాలని ఉందా? అయితే.. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాకు వెళ్లాల్సిందే!
జిల్లాలోని గాంధీనగర్‌కు చెందిన.. మాజీ పశువైద్యాధికారి గంగాధర్ కులకర్ణి జాతీయ పతాకాన్ని 75 ఏళ్లుగా రక్షిస్తున్నారు. బ్యాంకు లాకర్లో భద్రపరిచిన ఈ జెండాను.. ఏటా స్వాతంత్య్ర దినోత్సవం రోజున బయటకు తీసుకువచ్చి, తన ఇంటి ముందు ఎగురవేస్తారు. ఆ మరుసటి రోజు మళ్లీ జెండాను బ్యాంకుకు తీసుకువెళ్లి ఆయన భద్రపరుస్తారు.
గంగాధర్ కులకర్ణి కుటుంబ సభ్యులతో పాటు, స్థానికులంతా గంగాధర్ ఇంటివద్ద జెండా వందనం కార్యక్రమానికి హాజరవుతారు. అయితే.. కరోనా కారణంగా గత ఏడాది బయటివాళ్లను అనుమతించలేదు.
25 పైసలు చెల్లించి..
గంగాధర్ 1947లో నాలుగో తరగతి చదువుతున్నప్పుడు ఆయనకు ఓ ఉపాధ్యాయుడు ఈ పతాకాన్ని అందించారు. అందుకు తన తల్లి 25 పైసలు చెల్లించింది. గంగాధర్ కుటుంబం తమ నివాసాన్ని ధార్వాడ్‌కు మార్చుకునేముందు.. తమ స్వగ్రామమైన నలత్వాడ్ గ్రామంలో ఈ జెండాను ఎగురవేశారు. అదే రోజు ఈ పతకాన్ని ఆ ఊరిలో ఉన్న పాఠశాలలోను ఎగురవేశారు.