Karnataka Youth Bicycle Ride To Mecca: ప్రతి ముస్లిం తన జీవితంలో కచ్చితంగా అనుసరించాల్సిన ఐదు నియమాల్లో హజ్ యాత్ర ఒకటి. సౌదీ అరేబియాలో ఉండే ముస్లిం పవిత్ర స్థలమైన మక్కాకు తీర్థయాత్ర చేయటమే హజ్ యాత్ర. దీంతో తమ జీవితంలో ఒక్కసారైనా ఈ యాత్ర చేయాలని ప్రతి ముస్లిం భావిస్తారు. అలానే కర్ణాటకకు చెందిన ఓ యువకుడు కూడా హజ్ యాత్ర చేయాలని నిర్ణయించుకున్నాడు. అది కూడా సైకిల్‌పై మక్కాకు వెళ్లాలని అనుకున్నాడు. రెండు నెలల క్రితమే సైకిల్ యాత్రను ప్రారంభించిన యువకుడు.. ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌కు చేరుకున్నాడు. అతడే బాగల్కోట్ జిల్లాకు చెందిన హసన్ రజా(26).
హసన్ సెప్టెంబర్‌లో బాగల్కోట్ జిల్లాలోని తన ఇంటి నుంచి ఈ హజ్ యాత్రను ప్రారంభించాడు. యాత్రలో భాగంగా హసన్ రజా ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మురాదాబాద్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో అక్కడ స్థానికులు హసన్ చేస్తున్న ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ.. పూలమాలలతో స్వాగతం పలికారు. ఆ తర్వాత అలీగఢ్, లఖ్‌నవూ నుంచి నేపాల్‌కు వెళ్లి అక్కడి నుంచి చైనాకు ఆ తర్వాత సౌదీ అరేబియాకు చేరుకుంటాడని హసన్ రజా తెలిపాడు.
" ఈ ఏడాది ప్రారంభంలో కేరళకు చెందిన వ్యక్తి నడుచుకుంటూ మక్కాకు వెళ్లాడు. అతడిని చూసి ప్రేరణ పొంది నేను కూడా వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అందుకే సైకిల్‌పై యాత్రను ప్రారంభించాను. ఈ ప్రయాణంలో ఎన్నో మంచి పాఠాలు నేర్చుకుంటున్నాను. మరో నాలుగు నెలల్లో సౌదీ అరేబియాకు చేరుకుంటా."