Karnataka hijab controversy: కర్ణాటకలో హిజాబ్ వివాదం రోజుకురోజుకు ముదురుతోంది. విద్యాసంస్థల్లోకి హిజాబ్ ధరించిన వారిని అనుమతించకపోవడంపై పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిరసనకు దిగారు. ఉడుపి జిల్లా కుందాపుర్లోని ప్రభుత్వ పీజీ కళాశాల వద్ద ఆందోళన చేపట్టారు. ఇందులో ఇద్దరు ప్రమాదకర ఆయుధాలతో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు తప్పించుకున్నట్లు వెల్లడించారు. అరెస్టు చేసిన ఇద్దరి పేర్లు హజి అబ్దుల్ మాజిద్, రజ్జబ్ అని పేర్కొన్నారు. ఆయుధాలతో అల్లర్లకు ప్రేరేపించేందుకు నిందితులు ప్రయత్నించారని పోలీసులు ఇద్దరు నిందితులపై అభియోగాలు మోపారు.
అనుమతి..
కొద్ది రోజులుగా విద్యార్థినులు, తల్లిదండ్రులు చేస్తున్న నిరసనల అనంతరం కుందాపుర్ పీజీ కళాశాలలోకి హిజాబ్ ధరించిన వారిని సిబ్బంది అనుమతించారు. అయితే వారందరికీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తరగతి గదుల్లో పాఠాలు బోధించనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు విజయపురలో శాంతేశ్వర్ ఎడ్యుకేషన్ ట్రస్టులో కొందరు విద్యార్థులు కాషాయ శాలువా ధరించి క్యాంపస్‌లోకి వచ్చారు. దీంతో యాజమాన్యం ఈరోజు తరగతులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.