కర్ణాటక తుముకూరు జిల్లా గుబ్బి పోలీస్ స్టేషన్లో ఓ వింత కేసు నమోదైంది. ' మా చెరువు పోయింది. దయచేసి వెతికిపెట్టండి' అని కొంతమంది సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. దాంతో ఆ చెరువును వెతికేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
చెరువు ఎలా పోయిందంటే..?
గుబ్బి పట్టణం సమీపంలో మారనగెరె అనే గ్రామం ఉంది. అక్కడే సర్వే నంబర్ 17లో 46 ఎకరాల విస్తీర్ణంలో ఓ చెరువు ఉంది. కానీ, ఆ చెరువు కాస్త రానురానూ ఆక్రమణకు గురై కనుమరుగై పోయే స్థితికి చేరింది. అయితే.. ఆ చెరువును ఆక్రమించుకుంది ప్రభుత్వమే కావడం గమనార్హం.
చెరువు ఉన్న ప్రాంతంలో సంవత్సరానికి ఒకటి చొప్పున ప్రభుత్వ బిల్డింగులను నిర్మిస్తూ వస్తున్నారు. 1998 నుంచి ఇప్పటివరకు ఆ చెరువు అంతా ప్రభుత్వ భవంతులు, అసోసియేషన్ సొసైటీలు, వివిధ కమ్యూనిటీ హాళ్లతో నిండిపోయింది. 1998లో మొదటిసారి రెండు ఎకరాల భూమిని ఒకాలిగా అనే సామాజిక వర్గానికి, వీర శైవ కమ్యూనిటికి, విద్యా శాఖకు కేటాయించారు.