తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుడిలో కుల వివక్ష కేసులో ఐదుగురు అరెస్ట్

రెండేళ్ల దళిత బాలుడు గుడిలోకి ప్రవేశించాడని అతడి కుటుంబానికి అగ్రవర్ణాల వారు జరిమానా విధించిన వ్యవహారంలో కర్ణాటక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశారు.

Dalit
Dalit

By

Published : Sep 22, 2021, 3:47 PM IST

ఓ ఆలయంలోకి దళిత బాలుడు వెళ్లాడనే కారణంతో అతడి కుటుంబానికి రూ.25వేల జరిమానా విధించిన ఘటనలో ఐదుగురిని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. సెప్టెంబర్​ 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా.. సోమవారం కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఓ వర్గానికి భయపడి బాధిత కుటుంబం ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదని చెప్పారు.

ఇదీ జరిగింది..

కర్ణాటకలోని కొప్పల్‌ జిల్లా మియపురా గ్రామంలో నివసించే చెన్నదాసర వర్గానికి చెందిన చంద్రశేఖర్ సెప్టెంబర్ 4న తన పుట్టినరోజు సందర్భంగా స్థానిక ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లాడు. ఆ గుడిలోకి దళితులకు ప్రవేశం లేదు. ఈ విషయం తెలియని అతని రెండేళ్ల కుమారుడు ఆలయం లోపలికి పరుగెత్తుకుంటూ వెళ్లి దేవుడికి దండం పెట్టి వెనక్కి వచ్చాడు.

దీనితో ఆగ్రహించిన ఆలయ పూజారి అగ్రకులాల పెద్దలకు సమాచారాన్ని చేరవేశాడు. ఇది కాస్తా తీవ్ర వివాదానికి దారి తీసింది. బాలుని ప్రవేశంతో దేవాలయం అపవిత్రం అయ్యిందని గ్రామంలోని అగ్రవర్ణ ప్రజలు భావించారు. ఓ సమావేశం ఏర్పాటుచేసి అపవిత్రం అయిన ఆలయాన్ని పరిశుభ్రం చేయాలని.. అందుకు రూ.25 వేలు కట్టాలని బాలుడి తల్లిదండ్రులను ఆదేశించారు. ఈ వ్యవహారంపై చెన్నదాసర వర్గం గ్రామంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది.

గత రెండు రోజులుగా.. జిల్లా యంత్రాంగం గ్రామ ప్రజలతో సమావేశం ఏర్పాటుచేసి వారికి అవగాహన కల్పిస్తోంది. ఈ తరహా చర్యలు పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అగ్రవర్ణ ప్రజలను హెచ్చరించారు అధికారులు. పోలీసుల సమక్షంలో చెన్నదాసర్‌ వర్గం సహా ఇతర సంఘాలతో హనుమాన్​ ఆలయంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details