Karnataka Road Accident :కర్ణాటకలోని కలబురగిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. సిమెంట్ ట్యాంకర్‌ను ఆటో ఢీకొట్టడం వల్ల ఈ దుర్ఘటన గురువారం సాయంత్రం జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా నలావర్ గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు.
హలకర్తి సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఆటోలో ఉన్న ఆరుగురు మరణించారని.. 10 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సిమెంట్ ట్యాంకర్‌ను ఆటో ఓవర్టేక్ చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. నస్మీన్ బేగం, బీబీ ఫాతిమా, అబూబకర్, బీబీ మరియమ్మ, మహమూద్ పాషా, బాబాను మృతులుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. మృతదేహాలను శవపరీక్షల కోసం వాడి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Uttar Pradesh Road Accident : కొద్ది రోజుల క్రితం ఓ కారు చెట్టును ఢీకొట్టడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్డోయ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిందని పోలీసులు తెలిపారు. ఖమరియా గ్రామంలో బిల్హౌర్-కత్రా హైవేపై ప్రమాదం జరిగింది. కారులో నుంచి మృతదేహాలను వెలికి తీసేందుకు గ్యాస్ కట్టర్లు వినియోగించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మృతుల్లో నాలుగేళ్ల చిన్నారి సహా మొత్తం ఐదుగురు ఉన్నారు. బాధితులు బరాకాంత్ గ్రామానికి చెందిన వారు. వీరంతా బరాకాంత్ నుంచి నయాగావ్ వెళ్తున్నారు. మార్గ మధ్యలో కారు ప్రమాదానికి గురైంది. ఘటనపై స్థానికుల నుంచి సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకుని.. బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు.