కర్ణాటకలోని ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు, యాజమాన్యాలు బెంగుళూరులో భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. ఫీజుల్లో 30 శాతం కోత విధించాలని కోరుతూ ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు జనవరి 29న ఆదేశాలు జారీ చేసింది కర్ణాటక ప్రభుత్వం. ఈ చర్యను నిరసిస్తూ బెంగుళూరు రైల్వే స్టేషన్ నుంచి ఫ్రీడమ్ పార్కు వరకు ఆందోళన చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు ఇటీవలే పిలుపునిచ్చాయి.
ఈ విద్యాసంవత్సరం మొత్తం 70 శాతమే ఫీజు వసూలు చేస్తే ఉపాధ్యాయులకు జీతభత్యాలు ఎలా ఇవ్వాలని పాఠశాల యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. మంగళవారం చేపట్టిన ఈ నిరసనలో దాదాపు 25,000కు పైగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.