కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప రాజీనామాకు సిద్ధమైన నేపథ్యంలో రాజకీయ సందిగ్ధ వాతావరణం(Karnataka Politics) తలెత్తింది. భాజపా చరిత్రలో నాలుగో ముఖ్యమంత్రి తెరపైకి రానున్నారు. 2007 నవంబరు 12న రాష్ట్రంలో తొలిసారి భాజపా సర్కారు ఏర్పాటు కాగా.. అప్పటి నుంచి ముగ్గురు ముఖ్యమంత్రులు పాలన పగ్గాలు చేపట్టారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఏడాది పది నెలల సమయం ఉన్నా అప్పటి వరకు కొత్త నాయకుడి నేతృత్వంలోనే సర్కారు కొనసాగనుంది. ఈనెల 26తో భాజపా సర్కారుకు రెండేళ్లు నిండనుండగా ఆ సందర్భంగా ఏర్పాటయ్యే కార్యక్రమంలోనే ముఖ్యమంత్రి యడియూరప్ప తన స్థానానికి రాజీనామా చేయనున్నారు. ఇంత వరకు కొత్త నేత ఎవరో అధిష్ఠానం ప్రకటించలేదు. ఈనెల 25న కొత్త నాయకత్వంపై కీలక ప్రకటన వెలువడనుంది.
ఆది నుంచి అస్థిరతే
2004 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా భాజపా అత్యధిక స్థానాలను గెలుచుకుంది. మొత్తం 224 సీట్లున్న రాష్ట్ర విధానసభలో 79 స్థానాలను గెలుచుకున్న భాజపాకు అధికారం అందని ద్రాక్ష అయ్యింది. ఆ సమయంలో 65 స్థానాలు నెగ్గిన కాంగ్రెస్, 58 స్థానాలతో జేడీఎస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మూడేళ్ల తర్వాత ఈ రెండు పార్టీల మధ్య సమన్వయం కుదరకపోవటంతో సంకీర్ణం నుంచి జేడీఎస్ వైదొలిగి భాజపాకు చేరువైంది. 2007 నవంబరు 12న కర్ణాటకలో తొలిసారిగా భాజపా సర్కారు ఏర్పాటైంది. 20 నెలల ఒప్పందం ప్రకారం ఏర్పాటైన జేడీఎస్- భాజపా సంకీర్ణ సర్కారు సారధిగా- ముఖ్యమంత్రిగా బి.ఎస్.యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. దక్షిణ భారతదేశంలో తొలిసారి భాజపా సర్కారు కర్ణాటకలోనే ఏర్పాటైంది. వివిధ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఇప్పటి వరకు ఆరుసార్లు భాజపా సర్కారు ఏర్పాటు చేసినా ఏ ముఖ్యమంత్రీ ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగలేదు.
ఇదీ చదవండి:కీలక భేటీల రద్దు.. యడియూరప్ప రాజీనామా ఎప్పుడు?
అందరూ అర్ధాంతరమే
ఆరుసార్లు సర్కారును ఏర్పాటు చేసిన భాజపాకు ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. 2007లో ఏర్పాటైన జేడీఎస్, భాజపా సంకీర్ణ సర్కారు పొరపొచ్చాల కారణంగా కూలిపోయింది. ఈ కారణంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏడు రోజులకే యడియూరప్ప రాజీనామా చేశారు. 191 రోజుల రాష్ట్రపతి పాలన తర్వాత నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో యడియూరప్ప నేతృత్వంలోని భాజపా 110 స్థానాలతో ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది. 2008 మే 30న రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడియూరప్ప మూడు సంవత్సరాల 66 రోజుల పాటు పదవిలో కొనసాగారు. ఆయన తర్వాత డి.వి.సదానందగౌడ భాజపా సర్కారుకు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. విధానసభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ సమీకరణాల కారణంగా పార్టీ అధిష్ఠానం సదానందగౌడను తొలగించాల్సి వచ్చింది. కేవలం 341 రోజుల పాటే పదవిలో కొనసాగిన గౌడ.. 2011 ఆగస్టు 5న రాజీనామా చేసి జగదీశ్ శెట్టర్‌కు పాలన బాధ్యతలు అప్పగించడం సమకాలీన చరిత్ర.
ఆరు రోజులే పదవి..
2013 ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న భాజపా యడియూరప్పను మళ్లీ ఆహ్వానించింది. ఆయన నేతృత్వంలో 2018 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న భాజపా 104 స్థానాలను గెలుచుకుంది. సర్కారు ఏర్పాటుకు కనీసం 112 స్థానాలు అవసరం. అత్యధిక స్థానాలు గెలుచుకున్న ఏకైక పెద్ద పార్టీ హోదాలో భాజపా సర్కారును ఏర్పాటు చేసింది. 2018 మే 17న మూడో సారి ముఖ్యమంత్రిగా బి.ఎస్.యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. 80 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్, 28 స్థానాల జేడీఎస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కదిలాయి. సుప్రీంకోర్టు సూచనతో సంఖ్యా బలాన్ని చూపలేని ముఖ్యమంత్రి యడియూరప్ప కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే తన పదవికి రాజీనామా చేశారు. ఆపై ఏర్పాటైన సంకీర్ణ సర్కారు నుంచి 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి భాజపాలోనికి చేరిన విషయం తెలిసిందే. వీరి రాకతో సంఖ్యా బలాన్ని పెంచుకున్న భాజపా 2019 జులై 26న సర్కారును ఏర్పాటు చేసింది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బి.ఎస్.యడియూరప్ప వయోభారం కారణంగా రెండేళ్లకే తన పదవికి రాజీనామా చేయడానికి సమయం ఆసన్నమైంది. ఇప్పటి వరకు కర్ణాటక ముఖ్యమంత్రులుగా పని చేసిన వారిలో అత్యధికంగా నాలుగు సార్లు పదవిని అలంకరించిందీ.. ఒక్కో అవధిలో అత్యల్ప కాలం(ఆరు రోజులు) పని చేసిందీ బి.ఎస్.యడియూరప్పనే!
ఇదీ చదవండి:సీఎం యడియూరప్ప రాజీనామా చేస్తారా?