Karnataka New BJP President : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన భారతీయ జనతా పార్టీ.. తాజాగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చింది. బీజేపీ కర్ణాటక విభాగం అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్రను నియమించింది. 2020 నుంచి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతల్లో ఉన్న విజయేంద్ర.. అధ్యక్షుడి స్థానంలో ఉన్న నళిన్‌కుమార్ కటీల్‌ను భర్తీ చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చుతారనే ఊహాగానాలకు దీంతో తెరపడినట్లైంది.
BY Vijayendra Political Career :
గత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీవై విజయేంద్ర తన తండ్రి యడియూరప్ప సిట్టింగ్ సీటైన శికారీపుర నియోజక నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. న్యాయవిద్య పూర్తి చేసిన విజయేంద్ర.. గతంలో భారతీయ జనతా యువ మోర్చా జనరల్ సెక్రెటరీగానూ పనిచేశారు. కర్ణాటకలో బీజేపీపై లింగాయత్ నేత యడియూరప్ప ప్రభావాన్ని అధిష్ఠానం అంగీకరిస్తోందనేదానికి ఈ నిర్ణయమే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా విజయేంద్ర నియామకం.. యడియూరప్పకు రాజకీయ వారసత్వంగా పరిగణిస్తున్నారు. యడియూరప్ప పెద్ద కుమారుడు బీవై రాఘవేంద్ర ప్రస్తుతం శివమొగ్గ నుంచి లోక్‌సభ ఎంపీగా ఉన్నారు.
అధిష్ఠానానికి ధన్యవాదాలు..
కర్ణాటక బీజేపీ ఛీప్‌గా తనను నియమించడంపై స్పందించారు బీవై విజయేంద్ర. పార్టీ కార్యకర్తగా తనకు అధ్యక్ష బాధ్యతలను అధిష్ఠానం అప్పగించిందని అన్నారు. కేవలం తాను బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప కుమారుడినని పార్టీ పగ్గాలు అప్పజెప్పలేదని విజయేంద్ర తెలిపారు.