Minister Umesh Katti Passed Away : కర్ణాటక అటవీశాఖ మంత్రి ఉమేశ్ విశ్వనాథకత్తి (61) గుండెపోటుతో మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. డాలర్స్ కాలనీలోని తన నివాసంలో పడిపోయిన ఆయన్ను చికిత్స కోసం రామయ్య ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స విభాగంలో ఇచ్చిన చికిత్సకు ఆయన శరీరం స్పందించలేదని వైద్యులు తెలిపారు.
గుండెపోటుతో కర్ణాటక మంత్రి హఠాన్మరణం - కర్ణాటక అటవీశాఖ మంత్రి ఉమేశ్
కర్ణాటక అటవీశాఖ మంత్రి ఉమేశ్ విశ్వనాథకత్తి గుండెపోటుతో కన్నుమూశారు. డాలర్స్ కాలనీలోని తన నివాసంలో పడిపోయిన ఆయన్ను చికిత్స కోసం రామయ్య ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స విభాగంలో ఇచ్చిన చికిత్సకు ఆయన శరీరం స్పందించలేదని వైద్యులు తెలిపారు.
![గుండెపోటుతో కర్ణాటక మంత్రి హఠాన్మరణం Karnataka Minister Umesh Katti dies due to cardiac arrest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16303582-thumbnail-3x2-eee.jpg)
బెళగావి జిల్లా హుక్కేరి నుంచి ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, ఐదుసార్లు మంత్రిగా సేవలందించారు. మొదటిసారి జనతాదళ్ తరఫున 1985లో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 1999లో జేడీ (యూ) నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ నుంచి 2004లో పోటీచేసి ఓడిపోయారు. అప్పుడు మినహా, మరెప్పుడూ ఆయన ఓటమి ఎరుగలేదు.
సదానందగౌడ మంత్రివర్గంలో తొలిసారి వ్యవసాయ శాఖ, యడియూరప్ప మంత్రివర్గంలో ప్రజాపనుల శాఖను నిర్వహించిన ఆయన ప్రస్తుతం బొమ్మై మంత్రివర్గంలో ఆహార, అటవీశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. తాను ఎప్పటికైనా ముఖ్యమంత్రిని అవుతానని పలుమార్లు ప్రకటించుకున్నారు. ఉత్తర కర్ణాటకను విభజిస్తేనే ఆ ప్రాంత అభివృద్ధి సాధ్యమని పలుసార్లు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రెండుసార్లు గుండెపోటు గురైన కత్తికి.. వైద్యులు స్టంట్ వేశారు. హుక్కేరి నుంచి భార్య లీల, కుమారుడు నిఖిల్, కుమార్తె స్నేహ బెంగళూరుకు బయలుదేరారు. ఉమేశ్ కత్తి చిక్కోడి తాలూకా, ఖడకలాట గ్రామానికి చెందినవారు. ముఖ్యమంత్రి బొమ్మై, ఇతర మంత్రివర్గ సభ్యులు హుటాహుటిన రామయ్య ఆసుపత్రికి వెళ్లారు.